ఢిల్లీలో రైతుల ఆందోళనకు తోడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, బంద్‌లు కొనసాగుతున్నాయి… రైల్ రోకోలు, రాస్తారోకోలు ఇలా… ఎవ్వరికి తోచిన రీతిలో వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రైతుల ఆందోళన సెగ రైల్వేశాఖకు గట్టిగా తగిలింది.. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రైతు ఆందోళనల కారణంగా భారత రైల్వేకు రూ.2,400 కోట్ల నష్టం వాటిల్లినట్టు నార్తరన్ రైల్వే ప్రకటించింది. రైతు ఆందోళనల ఎఫెక్ట్‌పై మీడియాతో మాట్లాడిన నార్తరన్ రైల్వే జీఎం అశుతోష్ గంగల్.. బియాస్, అమృత్ సర్ మధ్య ఒక సెక్షన్ రైతుల దిగ్బంధంలో ఉందన్నారు.. దీంతో తార్న్ తరణ్ జిల్లా గుండా ప్రత్యామ్నాయ మార్గంలో రైళ్లు నడుపుతున్నామని.. ఇది అతిపొడవైన సెక్షన్ కావడంతో అవసరానికి అనుగుణంగా రైళ్లు నడపలేకపోతున్నామని వెల్లడించారు. అంచనా ప్రకారం పంజాబ్‌లో రైల్వేలకు రూ.2,400 కోట్ల వరకూ నష్టం వచ్చిందని చెప్పుకొచ్చారు అశుతోష్ గంగల్. రైతుల నిరసనలతో సమస్యలు తప్పడం లేదన్న ఆయన.. రైల్వేశాఖకు ఇది గుదిబండగా మారిందన్నారు. కాగా, ఎముకలు కొరికే చలిలో సైతం ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు రైతులు.. ఆ ఉద్యమంపై ఎంత తప్పుడు ప్రచారం చేసినా.. పట్టువదలని విక్రమారుడిలా ఆందోళన చేస్తున్నారు.
previous post
next post