జీవితములో
ప్రతి అధ్యాయం
ఇంకా రాయని తెల్ల కాగితం
కాలము తన చేతితో
అనుభవాలను గురువులా
నేర్పించే శిలాశాసనం
ప్రతి సూర్యోదయం
శ్వాసలలో ఆశలను
ఆశయాలను ప్రభవించే
బంగారు కెంజాయల కెరటం
తిమిరాలపై సంధించిన
ఆరుణ కాంతి కిరణం
ప్రతి సాయంత్రం
కొనసాగి ఆగిన బతుకు పయనం
మనలను మనకు చూపే గుండె ప్రతిబింబం
మంచి చెడుల బేరీజు సారం
రేపటి నడకకు స్పూర్తినిచ్చే
నవ్య సకారత్మక సందేశం
ప్రతి క్షణమొక
గడిచిన యుగాల ప్రతిరూపం
భావోద్వేగాల సుమహారం
ప్రతి పుటలో మనసు అక్షరం
పరవళ్ళు తొక్కు
సరికొత్త చైతన్య గీతం
ప్రతి అడుగూ
జీవన కదనం
అలుపెరుగని మలుపులలో
తెలియని ఉత్కంఠ భరిత కథనం
రేపన్నది ఎన్నటికీ
ఆశల తీపి తాయిలం
కాల చక్ర గమనంలో ప్రతి దినం
ప్రతి ఋతువు మార్పుకు శ్రీకారం
అవరోధాలను అధిగమించమనుప్రబోధం
నేటి తల వాకిట రేపటి గెలుపు సాకారం
శిశిరమునోర్చిన తరువు అవుతుంది
చైత్రంలో చిగురేసే మరో వసంతం
ప్రతి జీవితం ఓ నవ్య కలల కావ్యం
ప్రతి అధ్యాయం ఓ నవ్య సవాలుకు శ్రీకారం
ప్రతి పుట ఓ నవ్య క్రాంతి పథం
ప్రతి పదం ఓ నవ్య ప్రచోదన తేజం
ప్రతి అక్షరం ఓ నవ్య భావాకురం
ప్రతి ముగింపు ఓ స్పూర్తి కేతనం