telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

నీతిఆయోగ్ లో ఏపీసీఎం : .. ఏపీకి ప్రత్యేక హోదా .. చాలా అవసరం ..

apcm voice in nitiayog meeting

ఏపీసీఎం వైయస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి అన్నిరంగాల్లో తమను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్‌ సమావేశంలో కోరారు. సీఎం వైయస్ జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై నివేదిక అందజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒక నివేదికను ప్రధానితోపాటు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, నీతి ఆయోగ్ సభ్యుల ముందు ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోరుతూ కీలక అంశాలను నివేదికలో ప్రస్థావించారు. 14వ ఆర్థిక సంఘం 2015- 20మధ్య ఏపీ రెవెన్యూ లోటును ₹22113 కోట్లని అంచనా వేసిందన్నారు. గత ఐదేళ్లలో ఏపీ రెవెన్యూ లోటు ₹66362 కోట్లుగా ఉందని తెలిపారు. ఏపి వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, 2015-16లో తెలంగాణ తలసరి ఆదాయం ₹14414/- అయితే, ఏపీలో ₹8,397/- మాత్రమేనని సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, హోదా ఇస్తే రాష్ట్రానికి పెట్టుబడులు, మౌలిక వసతులు వస్తాయన్నారు.

రాష్ట్ర విభజన నాటికి ఏపీకి ₹97000 కోట్లు అప్పులు ఉంటే అవి కాస్త 2018 -19 నాటికి ₹258000 కోట్లకు చేరాయని చెప్పుకొచ్చారు. ఏడాదికి ₹20000 కోట్ల వడ్డీ, ₹20000 కోట్ల అసలు చెల్లించాల్సి వస్తోందని నీతి ఆయోగ్ కమిటీ ముందు స్పష్టం చేశారు. ఏపీ విషయంలో ప్రత్యేక హోదా షరతు ఆధారంగా రాష్ట్ర విభజన జరిగింది. రాజధాని లేకుండానే నవ్యాంధ్ర ఏర్పడింది. విభజన సమయంలో ఇచ్చిన హోదా షరతును నెరవేర్చాలని ప్రధానిని కోరుతున్నా. ప్రత్యేక హోదా హామీని 2014లో భాజపా ఎన్నికల ప్రణాళికలోనూ ఉంచింది అని జగన్‌ వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేదన్న సీఎం చేతివృత్తులు, ఉపాధి అవకాశాలు భారీగా తగ్గిపోయాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక యువత వలస వెళ్లడంపై సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రం నిలదొక్కు కుంటుందని సీఎం తన నివేదికలో పేర్కొన్నారు.

Related posts