telugu navyamedia
రాజకీయ

అమెరికాకు తాలిబన్ల హెచ్చరిక

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ సహా చాలా ప్రాంతాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత ఆప్ఘనిస్తాన్ నుంచి అమెరికా తన బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. ఆప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తమ బలగాలను తరలించే ప్రక్రియ గడువును పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. దీనిపై తాలిబన్లు స్పందిస్తూ గడువు ముగిసిన తర్వాత అమెరికా బలగాలు ఆప్ఘనిస్తాన్‌లో ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరికలు జారీచేశారు. ఆగస్ట్ 31 నాటికి అమెరికాకు రెడ్‌లైన్ అని ప్రకటించారు. అమెరికా గానీ, ఇంగ్లండ్ గానీ ఆఫ్ఘన్‌ను ఖాళీ చేయాల్సిందేనని వార్తా సంస్థలు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ నేతలు స్పష్టం చేశారు.

తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నా కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ లాంటి ప్రాంతాలు ఇంకా అమెరికా సైన్యం ఆధీనంలోనే ఉన్నాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వివిధ దేశాల పౌరులు, రాయబార సిబ్బందిని స్వదేశాలకు తరలించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే అమెరికా కూడా తమ పౌరులను, మిత్రదేశాల సిబ్బందిని కూడా తరలిస్తోంది. ఆప్ఘనిస్తాన్ పౌరులు కూడా తమను రక్షించాలంటూ ఎయిర్‌పోర్టులో దిగే ప్రతి విమానం వెనుక పరుగులు తీస్తున్నారు.

ప్రస్తుతం కాబూల్ ఎయిర్‌పోర్టు 5,800కు పైగా అమెరికా సైనికుల స్వాధీనంలో ఉంది. విమానాల్లో ప్రజలను భారీగా తరలించడం కష్టతరమైన ప్రక్రియ అని, అయినా కూడా తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్తాన్ నుంచి అమెరికన్లను, మిత్ర దేశాలకుచెందిన 65 వేలమందిని తరలిస్తామని జో బైడెన్ అన్నారు. తాము చేపట్టిన ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఆప్ఘన్‌ను విడిచి వెళ్లేది లేదని, అవసరమైతే గడువును పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నామని బైడెన్ అన్నారు. ఇప్పటివరకు 28 వేల మందిని తరలించగా ఇంకా సగానికి
పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తరలింపు ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ఇలాంటి అంశాలపై చర్చించేందుకు జీ7 దేశాలు అత్యవసరంగా సమావేశం కావాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారు.

Related posts