telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

పిఠాపురంలో మెగాస్టార్ ప్రచారం.. డేట్ ఎప్పుడు అంటే ?

ఒకానొక సినిమాలో చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నా, రాజకీయాలు తనను ఎప్పటికీ వదలవని సూచించే డైలాగ్ చెప్పాడు. నిజానికి చిరంజీవి చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

అయినా ఆయన ఎప్పుడూ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలుస్తూ వస్తున్నారు.

2014 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన చిరంజీవి ఆ తర్వాత రాజకీయాలకు స్వస్తి పలికారు. చివరకు రాజకీయాలకు పూర్తిగా వీడ్కోలు పలికారు.

తన సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో దూసుకుపోతున్నప్పటికీ, మరో సోదరుడు నాగబాబు ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ, చిరంజీవి ఆ రంగంలోకి ప్రవేశించలేదు లేదా దానిపై ఆసక్తి కూడా చూపలేదు.

రాజకీయ చర్చల్లో చిరంజీవి పేరు తరచుగా వినిపిస్తుంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డికి మారినప్పుడు,  చిరంజీవి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పాత్రను పోషిస్తారనే చర్చలు జరిగాయి.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష  బాధ్యతలను చిరంజీవికి అప్పగించాలని  భావించారు. ఇందుకోసం చిరంజీవితో మాట్లాడే బాధ్యతను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాంద్ కి అప్పగించారు.

ఆవసరమైతే తానే స్వయంగా చిరంజీవితో మాట్లాడతానని రాహుల్ అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

అయితే చిరంజీవి వీటికి వేటికీ స్పందించలేదు. సై అనలేదు. రాజకీయం తన వంటికి పడదు అన్నట్లుగా మౌనంగానే ఉండి పోయారు.

ఆ తరువాత కూడా మళ్లీ చిరంజీవి రాజకీయ ప్రవేశం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అది ఎప్పుడంటే  ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినిమా టికెట్ రేట్లను తగ్గించి సినిమా హీరోలు, నిర్మాతలను తన చుట్టూ తిప్పుకున్న సమయంలో,
చిరంజీవికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ప్రత్యేకంగా తాడేపల్లి ప్యాలెస్ కు పిలిచి చర్చలు జరిపారు.

ఆ సమయంలో చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ, రాజ్యసభ టికెట్ అంటూపెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి వాటన్నిటినీ ఖండించి రాజకీయాలకు తాను దూరం అని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపారు.

అయితే ఇప్పుడు అంటే ఏపీలో ఎన్నికల వేళ ఆయన అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.

దీంతో ఆయన కూటమి తరఫున ప్రచారం చేస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.

అయితే ఈ సారి వాటిని చిరంజీవి ఖండించలేదు.

దీంతో పిఠాపురం నుంచి పోటీలో ఉన్న తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఆయన ప్రత్యక్షంగా ప్రచారం చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలు చేశారు.

కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కు బహిరంగంగా మద్దతు పలికి, ఆయనకు ఓటేసి గెలిపించాలని వీడియో సందేశం కూడా ఇచ్చిన తరువాత సోదరుడు పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయడానికి వెనుకాడరని అన్నారు.

ఇప్పుడు చిరంజీవి కూడా తన సోదరుడి విజయం కోసం ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

వచ్చే నెల 5 నుంచి ఆయన పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు.

రోడ్ షోలలో పాల్గొననున్నారు. తన కుమారుడు హీరో రామ్ చరణ్ తో కలిసి పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయనున్నారు.

చిరు ప్రచారంలో పెద్ద సంఖ్యలో మెగా అభిమానులూ, బీజేపీ, తెలుగుదేశం శ్రేణులూ కూడా పాల్గొనేలా కూటమి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది.

అదే విధంగా ఆయన అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కోసం కూడా ప్రచారం చేసే అవకాశం ఉందంటున్నారు.

అంటే చిరంజీవి ప్రచారం పిఠాపురం, అనకాపల్లికే పరిమితమైనా ఆ ప్రభావం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ప్లస్ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Related posts