telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

శ్రేయస్‌ అయ్యర్‌ ఫై ప్రశంసల వర్షం కురిపించిన.. కేఎల్‌ రాహుల్‌ …

kl rahul appreciated sreyas ayyar

భారత ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ఆర్డర్‌తో సంబంధం లేకుండా బ్యాటింగ్‌, అదనపు బాధ్యతైన వికెట్‌ కీపింగ్‌లో రాణిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఛేదనలో 27 బంతుల్లో 56 పరుగులు చేశాడు. కోహ్లీ (45)తో కలిసి రెండో వికెట్‌కు 90 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. వికెట్‌ కీపింగ్‌ను ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు. నిజాయతీగా వికెట్‌ కీపింగ్‌ను ప్రేమిస్తున్నాను. ఐపీఎల్‌లో 3-4 ఏళ్లుగా కీపింగ్‌ చేస్తున్నా, అంతర్జాతీయ స్థాయిలో నాకిది కొత్త. దొరికినప్పుడు ఫస్ట్‌క్లాస్‌లోనూ వికెట్లను కాచుకున్నా. వికెట్ల వెనకాల ఉండటాన్ని ఆస్వాదిస్తున్నా. దీనివల్ల పిచ్‌ ఎలా స్పందిస్తుందో నాకు అవగాహన వస్తోంది. ఫీల్డింగ్‌లో మార్పు చేర్పులు చేసుకొనేందుకు సారథికి ఈ సమాచారం చేరవేస్తున్నా. చురుగ్గా ఉండటం, ఏ లెంగ్త్‌లు సరైనవో చెప్పడం నా బాధ్యత. 20 ఓవర్లు కీపింగ్‌ చేసిన తర్వాత బ్యాట్స్‌మన్‌గా ఎలాంటి షాట్లు బాగుంటాయో అవగాహన వస్తోంది. నాకు మంచి చేస్తున్నంత వరకు ఈ అదనపు బాధ్యతలను ఆస్వాదిస్తాను’ అని రాహుల్‌ చెప్పాడు.

శ్రేయస్‌ అయ్యర్‌ (58*; 29 బంతుల్లో) అద్భుత బ్యాటింగ్‌ను రాహుల్‌ ప్రశంసించాడు. ప్రణాళికలను కచ్చితత్వంతో అమలు చేశాడని పేర్కొన్నాడు. ‘ఇది అద్భుతమైన ముగింపు. ఒత్తిడితో కూడిన ఇలాంటి పరిస్థితుల్లో గెలిపించే బ్యాట్స్‌మన్‌ కోసం మేం చాలాకాలం వెతికాం. క్రీజులోకి దిగిన వెంటనే శ్రేయస్‌, దూబె, మనీశ్‌ బంతిని బాదడం నచ్చింది. 200+ స్కోరు ఛేదిస్తున్నప్పుడు ప్రతి ఓవర్లో బౌండరీ బాదడం అవసరం. శ్రేయస్‌ మ్యాచ్‌ను ముగించడం, అర్ధశతకం తర్వాత ప్రశాంతంగా సంబరాలు చేసుకోవడం బాగుంది. ఒక ఐపీఎల్‌ జట్టు సారథిగా అతడు పరిస్థితులను అర్థం చేసుకొని మ్యాచులను ముగిస్తున్నాడు. ఇది మాకు శుభసూచకం’ అని రాహుల్‌ అన్నాడు. టెస్టు జట్టులో చోటు చేజార్చుకున్న తర్వాత తన ఆటను అర్థం చేసుకున్నానని రాహుల్‌ చెప్పాడు. క్రికెట్‌ షాట్లపై స్పష్టమైన అవగాహన పెంచుకున్నానని తెలిపాడు. ప్రస్తుత సానుకూల ఆలోచనా ధోరణితోనే ముందుకు సాగుతానని వెల్లడించాడు. నిలకడగా జట్టుకు విజయాలు అందిస్తానని పేర్కొన్నాడు. నెట్స్‌ అయినా, మ్యాచ్‌ అయినా ఆత్మవిశ్వాసంతో ఆడటం ముఖ్యమని తెలిపాడు. పరిస్థితులకు అలవాటు పడటం కీలమని పేర్కొన్నాడు.

Related posts