telugu navyamedia
సినిమా వార్తలు

47 సంవత్సరాల “అడవిరాముడు”

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నటించిన సూపర్ డూపర్ హిట్ చిత్రం సత్యచిత్ర వారి “అడవిరాముడు” సినిమా 28-04-1977 విడుదలయ్యింది.

నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణ లు సత్యచిత్ర పతాకంపై ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో పూర్తి ఔట్ డోర్ లొకేషన్స్ ఫారెస్ట్ బాక్ గ్రౌండ్ తో సినిమా స్కోప్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

అడవిరాముడు చిత్రం కోసం ఎన్టీఆర్ గారు దాదాపు నెల రోజులు నల్లమల అడవులలో ఉంటూ సినీమా షూటింగ్ లో పాల్గొన్నారు. అంతేకాక పూర్తి ఔట్ డోర్ లొకేషన్స్ లో నటించిన చిత్రం కూడా ఇదే కావటం విశేషం.

ఈ చిత్రాన్ని కి కథ: సత్య చిత్ర యూనిట్, మాటలు: జంధ్యాల, సంగీతం: కె.వి.మహదేవన్, పాటలు: వేటూరి సుందరరామ మూర్తి., ఫోటోగ్రఫీ: ఏ. విన్సెంట్, కళ: తోట, నృత్యం:సలీం, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, జయప్రద, జయసుధ, సత్యనారాయణ, గుమ్మడి, నాగభూషణం, రాజబాబు, రమాప్రభ, శ్రీధర్, పండరీబాయి, రోహిణి, జగ్గయ్య,మాడా,చలపతిరావు, కాకరాల,తదితరులు నటించారు.

ప్రముఖ సంగీతదర్శకులు కె.వి.మహాదేవన్ గారి సంగీత సారధ్యంలో వెలువడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
“కృషి వుంటే మనుషులు ఋషులౌతారు”
“అమ్మతోడు అబ్బతోడు నీతొడూ నాతోడూ”
“ఆరేసుకోబోయి పారేసుకున్నాను”
“ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ ఎన్నెళ్ళె తిరిగొచ్చె”,
“”కుకు కుకు కోకిలమ్మ పెళ్ళికి కోనంతా సందడి”
పాటలు శ్రోతలను ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ప్రత్యేకంగా “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” పాటకు ప్రేక్షకులు నీరాజనాలు పలకటమే కాకుండా వెండితెరపైకి డబ్బులు(coins) విసిరి తమ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సంఘటన భారత చలనచిత్ర చరిత్రలో ఎక్కడా ఏ హీరో సినిమాకు జరగలేదు. అది ఒక్క ఎన్టీఆర్ గారి సినిమాకు మాత్రమే దక్కింది.

ఈ చిత్రం ద్విశతదినోత్సవ వేడుకలలో పాల్గొన్న హిందీ నటులు రాజకపూర్ గారు “కోకిలమ్మ పెళ్ళికి కోనంతా సందడి” పాట చిత్రీకరణను మెచ్చుకుంటూ ఏవిధంగా తీశారు అంటూ దర్శకుడు రాఘవేంద్రరావు గారిని అడిగి తెలుసుకుని ప్రశంసించారు

మదుమలై అడువులలో షూటింగ్ జరుపుకుని మంచికథ, కథనం, సంగీతం, స్టెప్పులతో సరికొత్త ట్రెండ్ సృష్టించింది “అడవి రాముడు” చిత్రం.

ఈ చిత్రం (బ్లాక్ బస్టర్) ఘన విజయాన్ని అందుకుని విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు,
32 కేంద్రాలలో 100 రోజులు, (శతదినోత్సవం)
16 కేంద్రాలలో 175 రోజులు( సిల్వర్ జూబ్లీ)
8 కేంద్రాలలో 200 రోజులు, (ద్విశతదినోత్సవం)
4 కేంద్రాలలో 365 రోజులు (స్వర్ణోత్సవం)
ప్రదర్శింపబడి ఆలిండియా రికార్డ్ సృష్టించింది.

‘అడవిరాముడు’ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రనే తిరగరాసింది. అటు కలెక్షన్స్ లోను సినిమా రన్నింగ్ లోను రికార్డ్ సృష్టించింది.

ఎన్టీఆర్ గారు నటించిన “లవకుశ”, “దానవీరశూరకర్ణ” సినిమాల తర్వాత కోటి రూపాయిలు (67 రోజులలో) పైగా కలెక్షన్స్ వసూలు చేసిన మూడవచిత్రంగా బాక్సాఫీస్ రికార్డ్ నెలకొల్పడం జరిగింది.

అలాగే సినిమా ప్రదర్శన లోను విశాఖపట్నం అలంకార్ ధియేటర్ లో 302 రోజులు ప్రదర్శింపబడి నేటికీ చెక్కుచెదరని శాశ్వత రికార్డ్ నెలకొల్పింది.

అంతేకాకుండా రోజుకు 3 ఆటలతో సినిమాలు నడవడం కష్టమైన ఆ రోజుల్లో 5 ఆటలతో నెల్లూరు కనకమహాల్ లో(daily 5 shows) 102 రోజులు ప్రదర్శింపబడి రికార్డ్ సృష్టించింది.

మొదటి వారంలో 23 లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేయగా, మొదటి 4 వారాలకు 55,15,456 రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది.

50 రోజులకు 81,41,009రూపాయలు, 67 రోజులకు కోటి రూపాయలు వసూలు చేసిన మొట్ట మొదటి సినిమా గా చరిత్రలో నిలిచిపోయింది.

తెలుగు సినిమా చరిత్రలో అప్పటి వరకు కోటి రూపాయలు వసూలు చేసిన 3 సినిమాలు ఎన్టీఆర్ గారివి కావడం విశేషం.

లవకుశ(1963),
దాన వీర శూర కర్ణ (1977),
అడవి రాముడు (1977)
ఈ మూడు సినిమాలు కోటి రూపాయలు వసూలు చేసాయి.

ఈ సినిమా 1977 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగుచిత్రంగా ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం జరిగింది.

ఎన్నో రికార్డులు రివార్డులు అందుకున్న ఈ చిత్రం నేటికి అభిమానులు, ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది…

Related posts