వైఎస్సార్సీపీ పాలనలో అదుపు తప్పిన శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు.
ఇదే విషయమై హోం మంత్రి అనిత మండలిలో శ్వేతపత్రం విడుదల చేశారు. శాంతిభద్రతలు విఫలమయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు దిల్లీలో నిరసన తెలుపుతున్నారు..
లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వర్తించడం ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత.. తప్పుడు రాజకీయాలు చేస్తే సహించం అని చంద్రబాబు హెచ్చరించారు.
గతంలో కొన్ని గ్రామాలకే ఫ్యాక్షనిజం పరిమితమైందన్న చంద్రబాబు వాటిపై శ్రద్ధపెట్టి శాంతిభద్రతలు అదుపు చేశామని తెలిపారు.
హైదరాబాద్‌లో మత ఘర్షణలను ఉక్కుపాదంతో అణచివేశామని, మతసామరస్యానికి విఘాతం లేకుండా చేయడంతో అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని తెలిపారు.
నాగరిక ప్రపంచంలో వామపక్ష తీవ్రవాదం మంచిది కాదని, గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో చాలావరకు వామపక్ష తీవ్రవాదం నియంత్రించామని చెప్పారు.
సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలనే దృఢసంకల్పంతో వెళ్లామని, రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవడానికి టీడీపీ కారణమని పేర్కొన్నారు.
రౌడీలపై ఉక్కుపాదం మోపాం:
తమ పాలనలో రౌడీలపై ఉక్కుపాదం మోపామని, పీడీ చట్టం ప్రయోగించామని సీఎం తెలిపారు.
దాదాపు 14,770 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాని, పోలీసులు బాధ్యతగా పనిచేయాలని బాడీ వోర్న్ కెమెరాలు పెట్టామని, చోరీల నియంత్రణకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
సమావేశాల పర్యవేక్షణకు మొబైల్ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు పెట్టామన్న సీఎం నేరాలు, దొంగతనాలు జరగకుండా ముందుగానే పట్టుకునే వ్యవస్థ తెచ్చామన్నారు.
ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ తీసుకువచ్చామని, శాంతిభద్రతల నిర్వహణతో ప్రతి ఒక్కరిలో నమ్మకం వచ్చిందని చంద్రబాబు తెలిపారు.
ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా మార్చారు:
ఐదేళ్లలో రాజకీయాలను ఉపయోగించుకుని ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో పోలీసు వ్యవస్థను పూర్తిగా విధ్వంసమైందని చంద్రబాబు తెలిపారు.
పోలీసుల అండతో ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారని, గత పాలనలో ఎంతో మంది మానసికంగా, శారీరకంగా మనోవేదన పడ్డారని సీఎం చంద్రబాబు అన్నారు.
మండలిలో 3 రాజధానుల బిల్లు విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించారని, ఛైర్మన్ పనిచేయకుండా చేసి గొడవపడ్డారని అన్నారు.
గత పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్న చంద్రబాబు ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారన్నారు.
పోలీసులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు.
వైఎస్సార్సీపీ నేతలతో విభేదిస్తే పోస్టింగ్ లేకుండా వీఆర్‌లో ఉంచేవారని, ఐదేళ్లపాటు వీఆర్‌లో ఉన్న అధికారులు కూడా ఉన్నారని వెల్లడించారు.
ఏకంగా 17 కేసులు పెట్టారు:
బాబ్లీ కేసు తప్ప తనపై గతంలో ఎప్పుడూ కేసులు లేవని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఏకంగా 17 కేసులు పెట్టారని చంద్రబాబు తెలిపారు. తనతో పాటు పవన్ కల్యాణ్‌పై ఏడు కేసులు పెట్టారన్న సీఎం..
ప్రతిపక్ష నేతలను అణచివేసేందుకు యత్నించారని అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై అతి ఎక్కువగా 60కి పైగా కేసులు పెట్టారని, పల్లా శ్రీనివాసరావు ఇంటిని కూల్చివేసే పరిస్థితి తీసుకురావడంతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చిందని గుర్తు చేశారు.
పులివెందులలో పోటీ చేసిన రవీంద్రనాథ్‌పై కేసుపెట్టి జైలులో పెట్టారని, సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ధూళిపాళ్లను జైలులో ఉంచారని, ప్రభుత్వాధికారులపై దాడి చేశారని కూన రవికుమార్‌పై, మహిళా నేతలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారని వివరించారు.
ఫర్నీచర్ దుర్వినియోగం చేశారని కోడెల శివప్రసాదరావుపై 18 కేసులు పెట్టారని, ఆ అవమానంతో కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
నాటి సీఎం ఇంట్లో ఇప్పుడు కూడా ప్రభుత్వ ఫర్నీచర్ ఉంది అని గుర్తు చేశారు. వంగలపూడి అనిత, అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార యత్నం కేసులు పెట్టారని, అచ్చెన్న ఆరోగ్యం సరిగా లేకపోయినా 600 కి.మీ వాహనంలో తిప్పారని తెలిపారు.
సంబంధం లేకపోయినా ప్రశ్నాపత్రం లీకైందని నారాయణపై కేసుపెట్టడంతో పాటు రఘురామను లాకప్‌లో చిత్రహింసలు పెట్టి వీడియో చూసి నాటి సీఎం పైశాచిక ఆనందం పొందారని వాపోయారు.
ఐదేళ్లు సొంత నియోజకవర్గానికి ఎంపీ రఘురామ వెళ్లకుండా చేశారన్న సీఎం.. రఘురామకు సొంత నియోజకవర్గంలో కూడా భద్రత లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
జై జగన్ అనలేదని:
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు జనసేన కార్యాలయాలపై దాడులు జరిగాయని సీఎం తెలిపారు.
జై జగన్ అనలేదని తోట చంద్రయ్యను దారుణంగా చంపారని, డ్రైవర్‌ను చంపి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశారని తెలిపారు.
ఐదేళ్ల వైఎస్సార్సీపీ హయాంలో 300 మంది బీసీలను హత్య చేశారని వివరించారు. టీడీపీ కార్యకర్తలపై 2560 కేసులు నమోదు చేశారని చంద్రబాబు చెప్పారు.
ప్రతిపక్ష పార్టీల కార్యకలాపాలను నియంత్రించడానికి జీవో 1 తీసుకొచ్చారని, వైఎస్సార్సీపీ హయాంలో జనసేన నేతలు, కార్యకర్తలపై 206 కేసులు, జగన్ సీఎంగా ఉన్నప్పుడు సొంత చెల్లెలైన షర్మిలపై కూడా 2 కేసులు పెట్టారని తెలిపారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించేందుకు అంగళ్లు ప్రాంతానికి వెళ్లిన తనపై కేసులు పెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు.
ప్రశ్నిస్తే కేసులు, దాడులే:
కొవిడ్ వేళ మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్‌పై, సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన టీచర్లపై, మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టారని సీఎం తెలిపారు.
టీచర్లపై పెట్టిన అక్రమ కేసులపై సమీక్షిస్తానని స్పష్టం చేశారు. బాధలు చెప్పుకోవడానికి జగన్ ఇంటికి వెళ్తే ఆరుద్రను చిత్రహింసలు పెట్టారుని, గతంలో జగన్ ఇంటి సమీపంలోనే ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగినా స్పందించలేదన్నారు.
దొంగతనం నెపం వేసి అబ్దుల్ సలాం మరణానికి కారణమయ్యారని, జగన్ హయాంలో దేవాలయాలపై దాడులు, అంతర్వేది రథాన్ని తగలబెట్టారని శ్వేతపత్రంలో పేర్కొన్న అంశాలను వెల్లడించారు.
ఇలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు:
వివేకా హత్య కేసులో మెుదట గుండెపోటు అని, తర్వాత హత్య అన్నారని, అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ వెళ్తే అడ్డుకున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. దేశంలో అత్యంత సీనియర్ నాయకుడిని అని చెప్తూ.. తన రాజకీయ చరిత్రలో జగన్ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదని చంద్రబాబు అన్నారు.
టాటా, రిలయన్స్ సంస్థల అధినేతలకంటే ఎక్కువ సంపాదించాలనేదే జగన్ కోరిక.. జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులు అని చంద్రబాబు స్పష్టం చేశారు.
కాగా, లా అండ్ ఆర్డర్‌పై మరింత లోతుగా చర్చించాలని, అసెంబ్లీలో మరో సెషన్ నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరగా సీఎం మద్దతుగా స్పందించారు.
లా అండ్ ఆర్డర్‌ను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, వచ్చే సెషన్‌లో లా అండ్ ఆర్డర్‌పై ప్రత్యేక చర్చ పెడదామన్నారు. శాంతిభద్రతల విషయంలో ఏపీని దేశంలో అగ్రస్థానంలో నిలబెడతామని, రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామని తెలిపారు.
అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షించేందుకు సిద్ధం అని స్పష్టం చేశారు. అధికారులు చట్టాన్ని గౌరవించినప్పుడే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయన్న చంద్రబాబు ఎన్డీఏ సభ్యులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిని తీసుకురావద్దని కోరారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా శిక్షిస్తామని చెప్పారు. తనకు ప్రాణసమానమైన కార్యకర్తలను పోగొట్టుకున్నానని చెప్తూనే కక్ష సాధింపులు తీర్చుకునేందుకు మనకు ప్రజలు అధికారం ఇవ్వలేదన్నారు.
అక్రమ కేసులపై కమిషన్ వేసేందుకు ఆలోచిస్తున్నానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.