telugu navyamedia
రాజకీయ

జోడు కట్టిన ఇరు పార్టీల నేతలు…జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి..

ముఖ్యమంత్రి కేసీఆర్​తో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​ భేటీ అయ్యారు. ఇరు పార్టీల నేతల మధ్య దాదాపు 2 గంటలకు పైగా చర్చలు కొనసాగాయి.

టీఆర్‌ఎస్‌ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ తుగ్లక్‌ రోడ్‌లోని తన నివాసంలో కేసీఆర్ శుక్రవారం నాడు అఖిలేశ్‌, ఎస్పీ ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌లతో లంచ్ విందులో కీలక అంశాలను చర్చించారు.

జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలు.. వాటిని ఎలా ఎదుర్కొవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే వాటిపై చర్చలు జరిగినట్లు సమాచారం.

దక్షిణాది పార్టీల విస్తరణకు భాషాపరమైన అడ్డంకులు ఉన్నాయని… ఉత్తర భారతంలో ఆ సమస్య లేనందున ఎస్పీ వంటి పార్టీలు పొరుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్‌, బిహార్‌, దిల్లీ, హరియాణాల్లోనూ విస్తరించాలని కేసీఆర్‌ సూచించినట్లు తెలిసింది

పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఇతర ప్రతిపక్షాలతో కలిసి పనిచేస్తున్న విషయాన్ని కేసీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతిపక్షాలు కలిసి ఉంటేనే కేంద్రంపై ఒత్తిడి పెంచవచ్చని, ఫలితంగా జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావం చూపొచ్చని కేసీఆర్‌, అఖిలేశ్‌ భావించారు..

ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికే పరిమితం కావడంతో కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్, అఖిలేశ్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. నాయకత్వ పటిమ, పొరుగు రాష్ట్రాల్లో రాజకీయ శూన్యతను భర్తీ చేసే శక్తి ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు రంగప్రవేశం చేయడం సరైన వ్యూహమని, టీఆర్ఎస్, ఎస్పీలను జాతీయ స్థాయికి విస్తరించాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అఖిలేశ్‌తో చర్చల అనంతరం కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌, జాతీయ పెన్షన్‌ పథకం, డిస్కంల నష్టాలపై కేంద్రానికి పంపాల్సిన సమాచారం గురించి ఆయన అధికారులతో చర్చించినట్లు సమాచారం

అఖిలేష్‌ మే 21న ఢిల్లీలో కేసీఆర్‌ను కలిశారు. తాజాగా మరోసారి భేటీ అవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పరస్పర సహకారంతో యూపీలో టీఆర్ ఎస్‌, తెలంగాణలో సమాజ్‌వాదీ పార్టీలు ఒకట్రెండు చోట్ల పోటీ చేస్తాయనే భావన వ్యక్తమవుతోంది.

Related posts