telugu navyamedia
రాజకీయ

కొత్త ఇంటికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. పెన్షన్‌ ఎంతో తెలుసా?

నూతన రాష్ట్రపతిగా ద్రౌపదిముర్ము ప్రమాణ స్వీకారం చేసిన గంట వ్యవధిలోనే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌ను విడిచిపెట్టారు. సోమవారం కోవింద్‌ తన సతీమణి సవితతో కలిసి ప్రభుత్వం కేటాయించిన 12 జన్‌పథ్‌లోని నూతన నివాసానికి చేరుకున్నారు.

సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆయన్ని ఈ నివాసానికి తీసుకువెళ్లేటప్పుడు నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పాటు, కేంద్ర మంత్రులు కిరణ్‌ రిజిజు, హర్దీప్‌సింగ్‌ పురి, వి.కె.సింగ్‌, భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా తదితరులు హాజరయ్యారు.

 

12 జన్‌పథ్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ నివాసం ఉన్నారు. 2020 అక్టోబరులో ఆయన కన్నుమూశాక తనయుడు చిరాగ్‌ పాసవాన్‌ దానిలో ఉండేవారు. ప్రభుత్వం ఈ ఏప్రిల్‌లో ఆయన్ని ఖాళీ చేయించింది. పదవీ విరమణ అనంతరం కోవింద్‌ దీనిలో ఉండేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది.

In pictures: Kovind bids goodbye to Rashtrapati Bhavan as Murmu takes over  as 15th President

రాష్ట్రపతి హోదాలో నెలకు రూ.5 లక్షల జీతం అందుకున్న రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఇకపై రూ.2.5 లక్షలు పింఛన్‌ లభిస్తుంది. ఇది జీవితాంతం కొనసాగుతుంది.

అదేవిధంగా  ఫోన్లు, కారుతో పాటు ఒక ప్రైవేటు కార్యదర్శి, ఒక అదనపు ప్రైవేటు కార్యదర్శి, ఒక పర్సనల్‌ అసిస్టెంట్‌, ఇద్దరు ప్యూన్లను మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కోసం ప్రభుత్వం కేటాయించింది.ఆఫీసు నిర్వహణ ఖర్చులకుగాను ఏడాదికి రూ.లక్ష ఇవ్వనున్నారు.

రాష్ట్రపతి పారితోషికం, పింఛన్‌ చట్టం-1951 ప్రకారం రిటైరైన రాష్ట్రపతి, ఆయన సతీమణికి జీవితకాలం ఉచిత వైద్యం, చికిత్సకు, దేశంలో ఎక్కడికైనా మరొకరిని వెంట తీసుకువెళ్లి ఉచితంగా ప్రయాణించడానికి ఆయనకు అర్హత ఉంటుంది.

Related posts