దేశరాజధాని రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తు కు సిద్ధం అవుతున్నాయి. ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఆప్ తో పొత్తుపై చర్చించనున్నారు. ఢిల్లీలో మొత్తం 7 లోక్ సభ స్థానాలు ఉన్నాయి.
అయితే కాంగ్రెస్ తో పొత్తుకు సంబంధించిన గత చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో… ఈ నెల ప్రారంభంలో ఆరు స్థానాలకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తమ అభ్యర్థులను ప్రకటించారు. తమతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని ఆ సందర్భంగా కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తాజాగా కాంగ్రెస్ కు రెండు సీట్లను ఇచ్చేందుకు ఆప్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే, కాంగ్రెస్ మూడు సీట్ల కావాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.
పంజాబ్ లో కూడా కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ సిద్ధంగా ఉంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే 2015లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీలోని 70 స్థానాల్లో 67 స్థానాల్లో ఆప్ జయకేతనం ఎగురవేసింది.