పెన్షన్లను రెట్టింపు చేయడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్సార్‌సీపీ షర్మిల వివాదాన్ని తెరపైకి తెచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశం మొత్తం తిరిగినట్లు హడావుడి చేసిన కేసీఆర్, మమతా బెనర్జీ ర్యాలీకి ఎందుకు రాలేదని నిలదీశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. పార్టీ కార్యక్రమాల్లో కొందరు సీనియర్లు చురుగ్గా వ్యవహరించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతిలో ధర్మపోరాట సభలను విజయవంతం చేయాలని చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 95 లక్షల మంది డ్వాక్రా మహిళలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఎన్ని ఇబ్బందులున్నా డ్వాక్రా మహిళలకు రూ.10,000 ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.చుక్కల భూముల సమస్య పరిష్కారంలో జాయింట్ కలెక్టర్లు విఫలమయ్యారంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. పోలవరం డ్యామ్ కు నిధుల కేటాయింపులో ఆలస్యంపై ఈరోజు మరోసారి కేంద్రానికి లేఖ రాశానని చంద్రబాబు అన్నారు. ఏపీలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.