telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ కాదు…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు నిరసనల సెగ తగిలింది. జిల్లాలో సంజయ్‌ పర్యటిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామపంచాయతీలకు రావాల్సిన రూ. 1024 కోట్లు విడుదల చేయాలని కోరుతూ.. జగిత్యాల-థరూర్ బ్రిడ్జిపై జగిత్యాల నియోజకవర్గ సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో ఫ్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. కాగా, సర్పంచ్‌లను అరెస్ట్ చేయాలని బీజేపీ నాయకులు పోలీస్‌లతో వాగ్వివాదానికి దిగారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఆ తర్వాత జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజాగా స్థానికంగా జరిగిన ఓ ఘటనపై స్పందిస్తూ.. మా మీద దాడులు చేస్తే ఆ తర్వాత దాడి జరిగేది ప్రగతి భవన్‌పైనేనని హెచ్చరించారు ఎంపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి మాది టీఆర్ఎస్ పార్టీ కాదు.. బీజేపీ అంటూ ఎంఐఎం నేతలను ఉద్దేశించి హాట్ కామెంట్లు చేశారు. ఇక, 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు కేంద్రం జమచేసిందన్నారు బండి సంజయ్.. రైతులను అనుగుంగా నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువస్తే కొందరు మూర్ఖులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. తెలంగాణ రాష్ట్రంలో  రైతులకు కనీస  పెట్టుబడి పరిహారం రాలేదని ఆరోపించారు. రైతులు పండించిన పంటను స్వయంగా రైతే ధర నిర్ణయించుకునే విధంగా నూతన వ్యవసాయ చట్టాలు ఉన్నాయన్న ఆయన.. దేశంలో ఎక్కడైనా లాభం చూసుకొని అమ్మేలా నూతన చట్టం ఉందని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవసాయ బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు బండి సంజయ్.. చట్టం తెచ్చి 6 నెలలు అయినప్పటికీ నువ్వు ఫామ్‌హౌస్‌లో పండుకుని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నావు అంటూ సెటైర్లు వేసిన ఆయన.. సన్నరకాలు పండించిన రైతులు బాధపడుతున్నారు.. కానీ, కేసీఆర్‌కు ఆ సోయిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతులను సన్న రకాలు పండిచాలని చెప్పిన ముఖ్యమంత్రి తన ఫామ్‌హౌస్‌లో మాత్రం దొడ్డు బియ్యాన్ని పండించారని విమర్శించారు.. ఇక, 120 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ జేబులో వేసుకున్నాడని ఆరోపించారు.

Related posts