telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గోదావరి మహోగ్రరూపం..కాసేప‌ట్లో 70 అడుగులు దాటే అవ‌కాశం.

*భద్రాది ద‌గ్గ‌ర గోదావ‌రి ఉగ్ర‌రూపం
*67.90 అడుగులు చేరిన నీటిమ‌ట్టం..
*కాసేప‌ట్లో 70 అడుగులు దాటే అవ‌కాశం..
*భద్రాచ‌లం న‌లువైపులా చేరిన వ‌ర‌ద‌
*భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

భధ్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గోదావరి నది నీటిమ‌ట్టం 68 అడుగులకు చేరింది. ఇవాళ మధ్యాహ్నానికి నీటిమట్టం 70 అడుగులను దాటి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం 21 లక్షల క్యూసెక్కులకు పైగా వ‌ర‌ద నీరు భధ్రాచలం నుండి దిగువకు విడుదల అవుతుంది. ఇప్పటికే భద్రాచలం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాలకు చెందిన సుమారు 4600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం చుట్టూ వరద నీరు చేరుకుంది.

మరో 48 గంటల పాటు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ముంపు గ్రామాల ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 80 అడుగుల నీటిమట్టం దాటినా భారీ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టామ‌ని మంత్రి పువ్వాడ తెలిపారు.

కాగా..గోదావరికి 1986, ఆగస్టు 16న రికార్డు స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలంలో గరిష్ఠంగా 75.6 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత ఆగస్టు 24, 1990న 70.8 అడుగులుగా నమోదైంది. అనంతరం.. గత 32 ఏళ్లుగా ఎన్నడూ భద్రాచలం వద్ద వరద నీటిమట్టం 70 అడుగులను దాటలేదు.

Related posts