telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

విఫలమవుతున్న ప్రభుత్వం-రైతుల చర్చలు…

దేశరాజధానిలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. ఇప్పటి వరకు ఆరు సార్లు కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య చర్చలు జరిగాయి.. అయితే, ఐదు విడతల్లో చర్చలు విఫలం అయినా.. ఆరో విడతలో మాత్రం కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని కేంద్ర మంత్రులే ప్రకటించారు.. అయితే, కేంద్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడుతున్నాయి రైతు సంఘాలు.. డిసెంబర్ 30వ తేదీన రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఆరవ విడత చర్చల్లో దాదాపుగా సగం అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యలపై స్పందించిన రైతు సంఘాల నేతలు.. ఆరవ విడత చర్చల్లో కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాలకు ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదని స్పష్టం చేశారు.. గతంలో జరిగిన ఐదు సమావేశాల మాదిరిగానే ఆరో విడత సమావేశం కూడా ముగిసిందని కుండబద్దలు కొట్టారు. కాగా, డిసెంబర్ 30న విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌, సోం ప్రకాశ్‌లు రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపిన విషయం తెలిపిందే.. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో.. రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరినట్లు నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రకటించారు.. విద్యుత్తు సవరణ చట్టంతో పాటు వాయుకాలుష్యం ఆర్డినెన్సులో రైతుల అభ్యంతరాలను పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.. ఇక, ఈ నెల 4వ తేదీన జరగనున్న ఏడో విడత చర్చల్లో వ్యసాయ చట్టాల రద్దు అంశంపై చర్చలు ఉంటాయని తెలిపారు. కానీ, రైతులతో కుదిరిన ఏకాభిప్రాయాలపై కేంద్ర ప్రభుత్వం చెబుతోన్న వాదనలు ఎంత మాత్రం వాస్తవం కాదని కొట్టిపారేశారు స్వరాజ్ ఇండియా స్థాపకులు యోగేంద్ర యాదవ్.. తమ ప్రధాన డిమాండ్లు రెండు ఉన్నాయి.. మొదటిది తాజాగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయడం.. రెండోది కనీస మద్దతు ధరపై చట్టబద్ధ హామీ ఇవ్వడం అని స్పష్టం చేశారు. అంతేకాదు.. ఏడో విడతలో తమ డిమాండ్లకు కేంద్రం ఒప్పుకోకపోతే.. కుండ్లీ నుంచి మానేసర్ మీదుగా పల్వాల్ (కేఎంపీ) వరకు జనవరి 6న ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. చుడాలి మరి ఎం జరుగుతుంది అనేది.

Related posts