telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత గడ్డపై భారత్‌తో సిరీస్‌ అంటే అత్యంత కఠిన సవాల్‌…

భారత గడ్డపై భారత్‌తో సిరీస్‌ అంటే అత్యంత కఠిన సవాల్‌ అని ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ కోచ్‌ గ్రహమ్‌ థోర్‌పె పేర్కొన్నాడు. గతకొంత కాలంగా అన్ని ఫార్మాట్‌లలో టీమిండియా అత్యుత్తమ క్రికెట్ ఆడుతుందని, అంతేగాక ఇటీవల కంగారూల గడ్డపై టెస్టుల్లో ఆస్ట్రేలియాని చిత్తుచేసి మరింత ఆత్మవిశ్వాసంతో ఉందన్నారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ అంతా మంచి ఫామ్‌లో ఉన్నారని, ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అని థోర్‌పె తెలిపాడు. అయితే కోహ్లీని ఔట్ చేయడానికి తమ వద్ద ఓ వ్యూహం ఉందని థోర్‌పె చెప్పాడు. తాజాగా వర్చువల్ విలేకరుల సమావేశంలో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ కోచ్‌ గ్రహమ్‌ థోర్‌పె మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని అందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా అతడు అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. సొంతగడ్డపై ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. అయితే అతడిని ఎదుర్కోవాలంటే మా బౌలింగ్ దళం అత్యుత్తమ బంతుల్నే విసరాలి. స్పిన్నర్లు, పేసర్లు అదే చేయాలి. మా వ్యూహం అదే. టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చేలా బౌలింగ్‌ చేయాలి’ అని అన్నారు.

‘టీమిండియా బౌలింగ్ విషయానికొస్తే.. స్పిన్‌తో పాటు పేస్‌ దళం పటిష్టంగా ఉంది. సీనియర్లు, జూనియర్లు బాగా రాణిస్తున్నారు. ఆసీస్ పర్యటనలో కీలక బౌలర్లు లేకున్నా.. మిగతావారు అద్భుతంగా రాణించారు. ఇక ఉప ఖండానికి వచ్చినప్పుడు స్పిన్‌ను ఎంతో జాగ్రత్తగా ఎదుర్కోవాలి. మా జట్టులో కొందరికి ఇక్కడ ఆడిన అనుభవం లేదు. అయితే వాళ్లు ఎంతో శ్రమిస్తున్నారు. మంచి ప్రదర్శనలు ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు’ అని గ్రహమ్‌ థోర్‌పె తెలిపారు. భారత్ ఇటీవలే ఆసీస్ పర్యటనకు ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. గబ్బా స్టేడియంలో 32 ఏళ్లుగా టెస్టుల్లో ఓడని ఆస్ట్రేలియాకి.. రహానే సేన ఓటమి రుచి చూపింది. ఇక నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1తో కైవసం చేసుకుంది.’మా జట్టులో దూకుడుగా ఆడే ఆటగాళ్లతో పాటు నిదానంగా రోజంతా ఆడే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. అయితే పరిస్థితులకు తగ్గట్లుగా వాళ్లు చక్కని ప్రదర్శన చేయాలి. భారత బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలి. ఇది సవాలే. టెస్ట్ సిరీస్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం’ అని ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ కోచ్‌ గ్రహమ్‌ థోర్‌పె చెప్పకొచ్చారు. ఫిబ్రవరి 5నుంచి భారత్‌తో ఇంగ్లాండ్ నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. తొలి రెండు టెస్టులు చెన్నై వేదికగా జరగనున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే చెన్నై చేరుకొని క్వారంటైన్‌లో ఉన్నారు. భారత క్రికెటర్లకు గురువారం జరిపిన తొలి రౌండ్‌ కొవిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. ఫిబ్రవరి 2న సాధన ఆరంభించడానికి ముందు ఆటగాళ్లు మరో రెండు సార్లు కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోవాల్సివుంటుంది. భారత క్రికెటర్లంతా ఇప్పుడు లీలా ప్యాలేస్‌ హోటల్లో బయో బబుల్‌లో ఉన్నారు. సుదీర్ఘ పర్యటనలో ఇరు జట్లు వరుసగా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి

Related posts