telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ముగినిసి ..లోకేష్ దీక్ష ..

lokesh protest comes to end

టీడీపీ నేత నారా లోకేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై చేపట్టిన ఒకరోజు దీక్ష ముగిసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు చేపట్టిన దీక్షను సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించారు. గుంటూరు నగరంలోని కలెక్టరేట్ ఎదుట లోకేశ్ ఈ దీక్షలో కూర్చున్నారు. లోకేశ్‌కు సంఘీభావంగా ఈ నిరసన దీక్షలో పలువురు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. సాయంత్రం వరకూ దీక్షలో కూర్చున్న లోకేశ్‍కు భవన కార్మికులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ..కొత్త ఇసుక విధానం పేరుతో విపరీతంగా ధరలు పెంచారు. లారీ ఇసుకను రూ.10 వేల నుంచి 40 వేలకు పెంచారు. బ్లాక్ మార్కెట్‍లో ఇసుక సరఫరా చేసే స్థాయికి దిగజారారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఇసుక కొరత లేదు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే ఐదుగురు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యక్తిగత ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని అబద్ధాలు చెబుతున్నారు అన్నారు.

మన రాష్ట్ర ఇసుక మన ప్రజలకే దొరకడం లేదు కానీ పక్క రాష్ట్రాల్లో దొరుకుతోంది. డౌన్ డౌన్ అంటేనే ఈ ప్రభుత్వం భయపడుతోంది. శాంతియుతంగా ధర్నాలు చేసే హక్కు మాకు లేదా? కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనబడటం లేదా..? ప్రభుత్వ విధానాలను ప్రజలు ఛీకొడుతున్నారు. ప్రభుత్వ విధానంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. లోకేశ్ చేపట్టిన ఈ ధర్నాకు టీడీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే గిరిధర్, డొక్కా మాణిక్యవర ప్రసాద్, మాజీ మంత్రి జవహర్, నక్కా ఆనంద్ బాబు తో పాటు పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ యువత పాల్గొన్నారు. ఇసుక కార్మికుల కష్టాలు ప్రభుత్వానికి పట్టటం లేదని నిరసన గళం వినిపించారు.

Related posts