టీడీపీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై దాడి వెనుక వైసీపీ హస్తం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ దాడికి పాల్పడిన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
శనివారం విజయవాడలో వైసీపీ నేతల దాడిలో చెన్నుపాటి గాంధీ కంటికి తీవ్ర గాయమైంది. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెన్నుపాటి గాంధీని చంద్రబాబు సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వైసీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. గుండాయిజాన్ని నమ్ముకున్న వారు ఎవరూ బాగు పడలేదన్నారు. చెన్నుపాటి గాంధీపై దాడి చేసిన నిందితులపై కేసులు పెట్టకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
వైసీపీ నేతలు ఓటమి భయంతో టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఖబడ్దార్.. ఇలాంటి ఘటన మరొకటి రిపీట్ అయితే ఎవరినీ వదిలిపెట్టే సమస్యే లేదని ఆయన హెచ్చరించారు.
కన్నుపొడవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితులకు శిక్షపడే వరకు న్యాయపరంగా పోరాడతామన్నారు.
విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడి చేశారని, ఆరోజే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితే మీ కుటుంబాలకు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబు అన్నారు.