telugu navyamedia
ఆంధ్ర వార్తలు

హైకోర్టు తీర్పుకు విరుద్దంగా ఏపీ మంత్రుల వ్యాఖ్యలు..రైతుల పాదయాత్రకు రక్షణ కల్పించండి

అమరావతి రైతుల పాదయాత్రకు భద్రత కల్పించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఉల్లంఘిస్తోందని రఘురామ వెల్ల‌డించారు.

అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో ..హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా మంత్రులు మూడు రాజధానులు మాట్లాడుతున్నారని ..ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

రైతులు వెయ్యి కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారని .. వారి పాదయాత్రపై కుట్ర చేస్తున్నారన్న అనుమానాలున్నాయని.. అలజడి సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోందన్నారు. కేంద్ర ఏజెన్సీల ద్వారా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని లేఖలో అమిత్ షాను రఘురామకృష్ణరాజు కోరారు.

ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపగానే ఆయన వాటిని పరిశీలిస్తారో.. లేదోనన్న అనుమానం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపే బిల్లులను ఒక్కసారి పరిశీలించాలని గవర్నర్ కు సూచించవలసినదిగా కేంద్రాన్ని కోరుతానని ఇప్పటికే ప్రకటించారు.

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో గవర్నర్లు చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారని.. ఏపీ గవర్నర్‌లో ఆ చురుకుదనం కనిపించడం లేదన్న భావన ప్రజల్లో వ్యక్తం అవుతుందన్నారు.

అమరావతి రైతుల పాదయాత్రను పర్యవేక్షించేందుకు.. అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. అలాగే అమరావతిని రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని రఘురామ ఆ లేఖలో పేర్కొన్నారు.

Related posts