telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేటి నుంచి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ys jagan cm

ఏపీ సీఎం వైఎస్ జగన్ నేటి నుంచి కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు. ఈ రోజు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకొని, అక్కడి నుంచి హెలికాప్టర్ లో జమ్మలమడుగు మండలం, సున్నపురాళ్లపల్లెకు చేరుకుంటారు. అక్కడ ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, సుమారు రూ. 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

ఈ మూడు రోజుల్లో కడప, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, రాయచోటి నియోజకవర్గాల్లో పలు నీటి పారుదల ప్రాజెక్టులు, ఆసుపత్రులు, రహదారులు, డ్రైనేజీలు, గ్రామ సచివాలయ భవనాలు ప్రారంభం కానున్నాయి.కుందూనదిపై కుందూ, తెలుగుగంగ ఎత్తిపోతల పథకం, రాజోలి ఆనకట్ట నిర్మాణానికి, కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద నిర్మించనున్న ఆనకట్టకు సంబంధించి దువ్వూరు మండలం నేలటూరు వద్ద శంకుస్థాపన శిలాఫలకాలను జగన్ ఆవిష్కరిస్తారు.

రూ. 15 వేల కోట్ల పెట్టుబడితో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తారు.ఈ పరిశ్రమ కోసం ఇప్పటికే 3,148 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. రూ. 107 కోట్లతో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్‌ ఆసుపత్రి భవనం, రూ. 175 కోట్లతో నిర్మించే సూపర్‌ స్పెషాలిటీ విభాగంలతో పాటు ఉచిత అన్నదాన, వసతి భవనాన్ని ప్రారంభిస్తారు. కడపలో డిస్ట్రిక్ట్ పోలీస్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసే జగన్, ఆపై కడపలో రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. రేపు రాయచోటి సమీపంలో రూ.1,272 కోట్లతో ఎత్తిపోతల పథకాలను, ప్రారంభించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Related posts