telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణకి నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం..

వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోడానికి, పునరావాస కార్యక్రమాలకు సహాయపడటానికి తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) కి ముందస్తుగా 224.50 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులు రాష్ట్రవ్యాప్తంగా పంటలు, ఇళ్లు కోల్పోయిన రైతులు, ప్రజల కోసం సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి ఉపయోగపడతాయి.

నిబంధనల ప్రకారం నిధులు వాస్తవానికి ఫిబ్రవరి-మార్చి, 2021 లో విడుదల చేయాల్సివుంది. అయినప్పటికీ, పునరావాస పనులను వెంటనే, చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి తెలంగాణ ప్రభుత్వానికి నిధులు అందుబాటులో ఉండాలన్న కారణంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ జి. కిషన్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చలు జరిపి, హైదరాబాద్, తెలంగాణాలో ప్రస్తుత పరిస్థితులని, నిధుల యొక్క ఆవశ్యకతను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను పంపించారు. కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం ఇప్పటికే హైదరాబాద్‌ను సందర్శించి వరద పరిస్థితిని తెలుసుకుని నష్టాన్ని అంచనా వేసింది. ప్రస్తుతం ఈ బృంద నివేదిక కేంద్రానికి అందాల్సి ఉంది. నివేదిక వచ్చిన తర్వాత, రాష్ట్రం మొత్తానికి సమగ్ర వరద ఉపశమన ప్యాకేజీ కోసం కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.

విపత్తు నిర్వహణలో నిధులను ముందస్తుగా విడుదల చేసినందుకు  గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి  శ్రీ క్రిషన్ రెడ్డి గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల వరదలు, భారీ వర్షాల కారణంగా పాడైన రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 202 కోట్ల రూపాయలను కూడా శ్రీ కిషన్ రెడ్డి గారి చొరవతో కేంద్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఈ సంధర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తక్షణంగా పరిస్థితులను చక్కదిద్దడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి తెలంగాణ రాష్ట్రానికి ఎల్లప్పుడూ కేంద్ర ప్రభుత్వ మద్దతుంటుందని మరొకసారి స్పష్టం చేశారు.

Related posts