telugu navyamedia
క్రీడలు వార్తలు

రేపు యూఏఈలో ఐసీసీ కీలక భేటీ…

ICC

అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లన్నింటినీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇక తాజాగా- టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నిర్వహణ కూడా డైలమాలో పడింది. టీ20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహణపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కసరత్తు ఆరంభించింది. దీనికోసం సోమవారం దుబాయ్‌లో భేటీ కానుంది. ఐసీసీ బోర్డు సభ్యులు ఇందులో పాల్గొంటారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధినేత సౌరవ్ గంగూలి, కార్యదర్శి జయ్ షా సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. దీనికోసం వారంతా దుబాయ్ బయలుదేరి వెళ్లనున్నారు. శనివారం ముగిసిన బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఐసీసీ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ఈ సారి భారత్ ఆతిథ్యాన్ని ఇస్తోన్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. గత ఏడాదే దీన్ని నిర్వహించాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐసీసీ దాన్ని ఈ ఏడాదికి వాయిదా వేసింది. ఇప్పుడు కూడా కరోనా స్థితిగతుల్లో ఎలాంటి మార్పూ లేదు. పైగా అది మరింత భీకరంగా మారింది. మహోత్పతాన్ని సృష్టించింది. గత ఏడాదితో పోల్చుకుంటే- ఈ సారి మరింత సంక్షోభానికి కారణమైంది. ఈ నేపథ్యంలో- టీ20 ప్రపంచకప్‌ టోర్నీని భారత్‌లో నిర్వహించడానికి వీలు పడుతుందా? లేదా అనేది ఐసీసీ నిర్ధారించాల్సి ఉంది.

Related posts