క్రికెట్ ఫ్యాన్స్ వరల్డ్ కప్ క్రికెట్ పోటీల నేపథ్యంలో ప్రాక్టీస్ మ్యాచ్ లలో చేతులెత్తేసిన ఇండియా, పాకిస్థాన్ లపై విరుచుకుపడుతున్నారు. నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓటమిపాలుకాగా, పసికూనని అందరూ చెప్పుకునే ఆఫ్గనిస్థాన్ చేతిలో పాకిస్థాన్ ఓటమిని చవిచూసింది. దీంతో ఈ రెండు జట్లకూ వరల్డ్ కప్ తెచ్చే అర్హత ఎక్కడిదని ఇరుదేశాల్లోని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు మ్యాచ్ లలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా, పాకిస్థాన్ లు కనీసం 50 ఓవర్ల పాటు క్రీజ్ లో నిలదొక్కుకోలేక పోవడం గమనార్హం. ఆఫ్గనిస్థాన్ లో జరిగిన మ్యాచ్ లో 47.5 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. ఆపై ఆఫ్గన్ ఆటగాళ్లు, 49.4 ఓవర్లలో విజయాన్ని సాధించారు.
ఆ జట్టు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందిస్తూ, 11 ఓవర్లలోనే 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆపై మిగతా ఆటగాళ్లు సంయమనంతో ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికి వస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో జడేజా మినహా ఎవరూ రాణించకపోవడంతో 179 పరుగులకే ఆలౌటైంది. ఆపై న్యూజిలాండ్ ఆటగాళ్లు సునాయాసంగా గెలిచారు. ఈ మ్యాచ్ ల తరువాత సామాజిక మాధ్యమాల వేదికగా దాయాది దేశాల ఫ్యాన్స్ క్రికెట్ టీమ్ లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలాగే ఆడితే కప్ కొట్టుకొచ్చే విషయం పక్కనపెడితే, కనీసం సెమీస్ కు కూడా వెళ్లలేరని తిట్ల దండకాన్ని అందుకున్నారు.