telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ సర్కార్​ ఇంజిన్​ స్పీడ్ గా ఉంది- కేంద్రంలో నాన్ బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి

మోడీ చెప్పినట్లే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ సర్కారు ఇంజిన్‌ స్పీడ్‌గా ఉందని.. కేంద్రంలో బీజేపీ పోయి తెలంగాణ లాంటి ప్రభుత్వం రావాలని సీఎం ఆకాంక్షించారు.

దేశంలో అన్నీ రంగాలు పతనం కావడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అలాంటి బీజేపీ నాయకులు హైదరాబాద్ కు వచ్చి టీఆర్ఎస్‌ పాలనను విమర్శించడాన్ని సీఎం కేసీఆర్‌ తీవ్రంగా తప్పు పట్టారు.

దేశ చరిత్రలోనే అత్యంత అసమర్ధ ప్రధాని మోడీనే అని కేసీఆర్ అభివర్ణించారు. మీ అసమర్ధ విధానాల వల్ల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు విదేశాలకు తరలిపోతున్నాయని సీఎం అన్నారు. మోడీ విదేశాలకు వెళ్లి గుప్పెడు మంది పెట్టుబడిదారులకు సేల్స్‌మెన్ గా పనిచేశాడంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు.

కేంద్రంలో ప్రధాని మోదీ అసమర్ధ పాలన వల్లే దేశం ఆర్ధికంగా, అభివృద్ధిలోనూ చితికిపోయిందన్నారు. దేశ రాజధానిలో నీళ్లు, కరెంట్ ఇవ్వలేని బీజేపీ పాలనకు తెలంగాణకు వచ్చి డబుల్ ఇంజన్ సర్కారు కావాలనడం సిగ్గుచేటన్నారు. జీడీపీ, పర్‌ క్యాప్టా ఇన్‌కమ్‌లో కూడా తెలంగాణ కేంద్రం కంటే డబుల్‌ స్పీడుతో ఉందన్నారు.

దేశాన్ని పాలించిన ప్రధానులు ఎంతో మంది ఉన్నారని.. ఎవరూ నరేంద్ర మోదీ అంతటి దౌర్భాగ్య పాలన అందించలేదన్నారు కేసీఆర్. కేవలం మోదీ పవర్ పాలసీల వల్లే దేశ రూపాయి పతనం దగ్గర నుంచి పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి తలెత్తిందన్నారు కేసీఆర్. కేవలం ఇదంతా మోదీ చేతకాని తనం, దరిద్రమేనని విమర్శించారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో హైదరాబాద్‌కు వచ్చి కారు కూతలు కుశారంటూ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం. రైతుబంధు, రైతుభీమా, రైతులకు ఉచిత కరెంట్ వంటి సౌకర్యాలు కల్పిస్తుంటే వాటిని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు కేసీఆర్.

దేశ తలసరి ఆదాయం లక్షా 49 వేల 848 రూపాయలని.. తెలంగాణ తలసరి ఆదాయం 2 లక్షల 78 వేల 833 రూపాయలని కేసీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాల వల్ల తెలంగాణ 3 లక్షల కోట్లు నష్టపోయిందని… కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించి తీరతామని సీఎం స్పష్టం చేశారు.

యూపీ నుంచి ఒకాయన లుంగీ కట్టుకుని వచ్చాడని… ఆయన ఉపన్యాసం చెబితే మనం వినాలట అంటూ యోగి ఆదిత్యనాథ్ పై సెటైర్లు వేశారు. బీజేపీయేతర రాష్ట్రాల్లోనే తలసరి ఆదాయం ఎక్కువగా వుందని కేసీఆర్ గుర్తుచేశారు.

Related posts