telugu navyamedia
రాజకీయ

బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసు : దోషుల విడుదలపై గుజరాత్‌ సర్కార్‌కు షాకిచ్చిన సుప్రీం కోర్టు.. నోటీసులు జారీ

గుజరాత్‌ లో బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో 11 మంది దోషులను ప్రభుత్వం క్షమాభిక్ష కింద విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం గుజరాత్‌ సర్కార్‌ నుంచి వివరణ కోరింది.

ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. దోషుల విడుదలపై గురువారం గుజరాత్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

గుజరాత్ నిబంధనల ప్రకారం, దోషులు ఉపశమనం పొందేందుకు అర్హులా కాదా?. ఉపశమనాన్ని మంజూరు చేసేటప్పుడు దరఖాస్తును ఎలా పరిగణనలోకి తీసుకున్నారో చూడాల్సి ఉందంటూ అంటూ సుప్రీం బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఈ మేరకు గుజరాత్‌ ప్రభుత్వం దోషుల విడుదలపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది సుప్రీం కోర్టు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను రెండువారాల పాటు వాయిదా వేసింది.  

2002లో గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిల్కిస్ బానో మూడేళ్ల కూతురుతో సహా 14 మంది కుటుంబ సభ్యులను హత్య చేశారు. ఈ కేసులలో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించారు.

గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు మేరకు.. రిమిషన్ పాలసీ ప్రకారం ఈ కేసులో దోషులను విడుదల చేయడానికి అనుమతించింది. దీంతో వారు ఆగస్టు 15న దోషులు గోద్రా సబ్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో 15 సంవత్సరాలకుపైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత దోషుల్లో ఒకరు రిమిషన్‌ పిటిషన్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రిమిషన్‌ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు గుజరాత్‌ సర్కార్‌ను ఆదేశించింది. ఇక తన రిమిషన్‌ పాలసీ ప్రకారం జీవిత ఖైదుగా అనుభవిస్తున్న మొత్తం 11 మంది దోషులను విడుదల చేయడానికి గుజరాత్‌ ప్రభుత్వం అనుమతించింది.గత వారం వారు గోద్రా జైలు నుంచి విడుదలయ్యారు

అయితే గుజరాత్ ప్రభుత్వం తీసుకన్న ఈ నిర్ణయంపై  బాధితురాలితో పాటు వివిధ రాజకీయ పక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయంగానూ గుజరాత్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బిల్కిస్‌ బానో తరపున న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పదకొండు మంది విడుదలను సవాల్‌ చేస్తూ ఓ పిటిషన్‌ దాఖలు చేశారు.

 

Related posts