భారత క్రికెటర్లకు డోప్ టెస్టులపై మీనమేషాలు లెక్కిస్తూ వచ్చిన బీసీసీఐ ఎట్టకేలకు తలొగ్గింది. ఇక మీదట భారత క్రికెటర్లకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) డోప్ టెస్టులు నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకారం తెలిపింది. ఈ మేరకు భారత కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ క్రికెటర్లకు డోప్ టెస్టులు నిర్వహించే అధికారం నాడాకు లేదని ఇన్నాళ్లు పట్టుదలగా వ్యవహరించిన బీసీసీఐ కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ జోక్యంతో వెనక్కి తగ్గింది.
వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఓవైపు, ఐసీసీ మరోవైపు ఒత్తిడి పెంచడం కూడా బీసీసీఐ వైఖరి మారడంలో దోహదపడ్డాయి. ఈ మేరకు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ కేంద్ర క్రీడల శాఖకు లిఖితపూర్వకంగా సమ్మతి తెలియజేశారు. ఇక మీదట ఎప్పుడైనా సరే భారత క్రికెటర్లకు నాడా డోప్ టెస్టులు నిర్వహించే వీలుంటుంది.