telugu navyamedia
రాజకీయ వార్తలు

విజయవాడ రాజ్‌ భవన్‌లో .. ఘనంగా నూతన సంవత్సర వేడుకలు..

new year celebrations in vijayawada rajbhavan

కొత్త సంవత్సరంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలని గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరి చందన్‌ ఆకాంక్షించారు. విజయవాడ రాజ్‌ భవన్‌లో నూతన సంవత్సర వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. గవర్నర్‌కు ఉన్నతాధికారులు, ప్రముఖులు, పెద్దలు, చిన్నారులు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ గవర్నర్‌ దంపతులను ఆశీర్వదించారు. ఆలయ పురోహితులతోపాటు దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఆలయ కార్యనిర్వహణ అధికారి గవర్నర్‌కు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ‘ఓపెన్‌ హౌస్‌’ కార్యక్రమంలో గవర్నర్‌ను మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పౌర సమాజ ప్రతినిధులు, సీనియర్‌ అధికారులు, స్థానికులు కలుసుకున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల కేంద్రం నుండి చిన్నారులు, అనాథ గృహాల పిల్లలు గవర్నర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు గవర్నర్‌ దంపతులను ఆశీర్వదించగా, టిటిడి ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ప్రసాదాన్ని అందించారు. సాయంత్రం రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డిజిపి గౌతమ్‌ సవాంగ్‌, పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, కరికాల వలవన్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్స్‌ శాఖ కమిషనర్‌ సిద్ధార్థ్‌ జైన్‌, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజరు జైన్‌, జిఎడి కార్యదర్శి శశి భూషణ్‌ కుమార్‌, ప్రోటోకాల్‌ డైరెక్టర్‌ కిషోర్‌ కుమార్‌, చేనేత జౌళి శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, సమాచార కమిషనర్లు బివి రమణ కుమార్‌, ఐలాపురం రాజా, రవి కుమార్‌ గవర్నర్‌ను కలిశారు. సాయంత్రం రెడ్‌ క్రాస్‌ సొసైటీ నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గవర్నర్‌కు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఫోన్‌ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Related posts