telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీ రైతులకి శుభవార్త ‘అన్నదాత సుఖీభవ’ పథకం 10 వేల ఆర్థిక సాయం ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం ఈరోజు మరోసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది.

‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు, విధివిధానాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో మొత్తం 76.21 లక్షల కమతాలుండగా వీటిలో 5 ఎకరాల కమతాల రైతులు 60లక్షల మంది ఉన్నారు.

కేంద్రం ఇచ్చే రూ.6 వేల సాయంతో కలిపి ఒక్కో రైతు కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కేంద్ర పథకానికి అర్హత లేని రైతులకు కూడా రూ.10 వేల సాయాన్ని అందించాలని తీర్మానించారు. తెలంగాణ తరహాలోనే రైతులందరికీ ఈ సాయం అందించాలని నిర్ణయించారు.

“కేంద్రం ఈ పథకానికి అనేక ఆంక్షలు పెట్టింది. 5ఎకరాల లోపు వారే అంది, 3వాయిదాలలో ఇస్తామంది, కొందరికే ఇచ్చి మిగిలిన రైతులను వదిలేసింది. కానీ మేం రైతులు అందరికీ ఇస్తున్నాం” కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వివరించారు.ఖరీఫ్‌లో, రబీలో 2 దశలుగా ఒక్కో సీజన్‌కు రూ.5 వేల చొప్పున అందించాలని, కౌలు రైతులకు కూడా ఈ ఖరీఫ్ నుంచే ఈ సాయం అందించి ఆదుకునేలా మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు.

ఇతర నిర్ణయాలు

ఫిబ్రవరి చివరినాటికి ‘అన్నదాత సుఖీభవ’ చెక్కుల పంపిణీ, రైతు రుణ మాఫీ చెల్లింపులు పూర్తిచేయాలని మంత్రి వర్గం తీర్మానించింది. 76.21 లక్షల రైతు కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సాయం అందిస్తే మొత్తం రూ.7,621 కోట్లు అవసరమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
2014 జూన్ నుంచి 07.02.2019 వరకు 3,92,745 ఇళ్లపట్టాలు ఇచ్చామని, క్రమబద్దీకరణ కింద 71,221 (డ్వెల్లింగ్ యూనిట్స్) ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ప్రభుత్వ భూముల్లో 92,960 ఇళ్ల పట్టాలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయని, క్రమబద్దీకరణ కింద మరో 5,074 ఇళ్ల పట్టాలు (డ్వెల్లింగ్ యూనిట్స్) పంపిణీకి సిద్దంగా ఉన్నాయని మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు.
22 ఆస్పత్రుల స్థాయిని పెంచడానికి ఆమోదం తెలిపింది.
డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు సిమ్ కార్డు, 3 ఏళ్లపాటు చెల్లుబాటయ్యే కనెక్టివిటీ ఇవ్వాలని నిర్ణయించారు.
జర్నలిస్టులకు ఎకరం రూ.10 లక్షల చొప్పున అమరావతిలో 30 ఎకరాల భూమి కేటాయించాలనే నిర్ణయానికి కెబినెట్ ఆమోదం తెలిపింది. తొలి విడతగా కోటి రూపాయలు సీఆర్డీఏకు చెల్లిస్తే సొసైటీకి భూమి బదలాయింపు ప్రక్రియ చేపడతామని వెల్లడించింది. మిగతా మొత్తాన్ని రెండేళ్లలో సీఆర్డీఏకి చెల్లించే వెసులుబాటును మంత్రివర్గం కల్పించింది.
ఎన్జీఓలు, సచివాలయ ఉద్యోగులకు చదరపు గజం రూ.4వేల చొప్పున 175 చదరపు గజాల ఇంటి స్థలాలను కేటాయించాలని నిర్ణయించారు. దీనికోసం 230 ఎకరాలను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐఏఎస్‌లకు కూడా ఇళ్లను కేటాయించాలని తీర్మానించింది.
రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటుకు మంత్రిమండలి నిర్ణయించింది. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో తరహా ఈ మండలిని ఏర్పాటుచేస్తున్నారు. వ్యవసాయ విద్యను మరింత నాణ్యత, నైపుణ్యం, సాంకేతికతతో కూడిన విధంగా చేయడానికి ఈ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇకపై అగ్రికల్చర్, హార్టీకల్చర్ ప్రాక్టీషనర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ఆమోదించింది.
1998లో డీఎస్సీలో అర్హత పొందిన 36 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని మంత్రిమండలి నిర్ణయించింది.
2008లో డీఈడీ, బీఈడీ అర్హతల విషయంలో అనర్హులై పెండింగ్‌లో ఉన్న వారికి కూడా కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించే విషయాన్ని పరిశీలించాలని నిర్ణయించింది.
1983-96 మధ్యలో నియమితులైన స్పెషల్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, భాషా పండితులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నారు.
శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, తిరుపతి ఆధ్వర్యంలో 9 పశుసంవర్థక పాలిటెక్నిక్‌లు, 9 ఫిషరీస్ పాలిటెక్నిక్‌ల ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కళాశాలలో 50 సీట్లు ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరం (2019-20) నుంచి ఈ కళాశాలలు ప్రారంభం అవుతాయి.
ఢిల్లీ ధర్మపోరాట దీక్షకు చేసిన ఖర్చు (రైలుకు రూ.కోటీ 23 లక్షలు ప్లస్ ఏపీ భవన్‌లో అయ్యింది రూ. కోటీ 60 లక్షలు) మొత్తం రూ.2 కోట్ల 83 లక్షల ఖర్చుకు కేబినెట్ ఆమోదం.
గ్రామ పంచాయతీ కంటెంజెన్సీ ఉద్యోగుల జీతాలు పెంచుకునేందుకు గ్రామ పంచాయతీలకు వెలుసుబాటు కల్పిస్తూ తీర్మానించింది.
పోలవరం డీపీఆర్-2 కు సీడబ్ల్యూసీ ఆమోదంపైన కూడా చర్చ జరిగిందని మంత్రి తెలిపారు.
భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చినవారికి ఇవ్వాల్సిన రూ.5 లక్షలు కూడా చెల్లించాలని నిర్ణయం. దీనికోసం రూ.35 కోట్లు కేటాయింపు.
తిత్లి, పెథాయ్ తుపాన్లలో నష్టపోయిన రైతులకు పెండింగ్ పరిహారం వెంటనే చెల్లింపు
బీసీ(బి)లో ఉన్న వక్కలిగ/కుంచటిగ సామాజిక వర్గం చిత్తూరు జిల్లాలో వున్న వారికి కూడా రిజర్వేషన్ వర్తింపు చేయాలని మంత్రిమండలి నిర్ణయం.

Related posts