telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విజయవాడ గ్యాంగ్ రేప్ కేసు : సీఐ, ఎస్​ఐలపై వేటు

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.

ఈ ఘ‌ట‌న‌పై విజయవాడ సీపీ విచారణ నిర్వహించారు. ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన ఉన్నతాధికారులకు సీఐ, ఎస్ఐల నిర్లక్ష్యం తేటతెల్లమైంది. దీంతో సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని విజయవాడ సీపీకి డీజీపీ శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేశారు.

విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హించిన‌ సీఐ హనీష్, సెక్టార్ ఎస్సై శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు విధించారు. కుమార్తె కనిపించలేదన్న తల్లిదండ్రుల ఫిర్యాదును పట్టించుకోకపోవడంపై ఈ చర్యలు తీసుకున్నారు.

మానసిక వికలాంగురాలైన ఓ యువతి (23)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 30 గంటలపాటు ఆమె పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. ఓ ఇరుకు గదిలో బంధించి దాడికి పాల్పడ్డారు. అప్పటి వరకూ ఇంటి వద్దనున్న తమ కుమార్తె కనిపించట్లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటానికి వెళ్లగా.. స్పందించకుండా సాయంత్రం రావాలంటూ తిప్పి పంపించేశారు. చివరిసారిగా ఫలానా నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని ఆధారమిచ్చినా సరే వెంటనే చర్యలు చేపట్టలేదు.

నున్న పోలీసులు కారణంగా యువతిపై అఘాయిత్యం జరిగిందని, పోలీసులు సకాలంలో కేసు నమోదు చేసి విచారణ చేపడితే ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకపోయేది అని బాధితురాలి కుటుంబసభ్యులు, బందువులు ఆరోపించారు.

Related posts