telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జమ్మూకశ్మీర్ పై .. గవర్నర్ సత్యపాల్ .. స్పష్టత..

J & K governor clarity on rumors on state

జమ్మూకశ్మీర్‌ పై అనేక ఊహాగానాల నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ స్పష్టత ఇచ్చారు. ఇప్పటివరకైతే తీవ్రవాదుల దాడుల నేపథ్యంలోనే రాష్ట్రంలో భద్రతను పెంచినట్టు చెప్పారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సాధారణంగానే ఉందన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయనతో ఓ వార్తా సంస్థ ముఖాముఖి నిర్వహించింది.

ప్రశ్న: జమ్మూకశ్మీర్‌ పరిస్థితిని మీరు ఎలా చూస్తారు?
రాష్ట్రంలో పరిస్థితి సాధారణంగానే ఉంది. లాల్‌ చౌక్‌లో ఏదైనా అనుకోనిది జరిగితే అంతా తెలిసిపోతుంది. కొన్ని రాజకీయ పార్టీలు అనవసర గందరగోళం సృష్టిస్తున్నాయి తప్ప అక్కడ కొత్తగా ఏమీ జరగలేదు.

ప్రశ్న: ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ మిమ్మల్ని కలిశారు కదా?
కేంద్రం ద్వారా నాకు తెలిసిన వివరాల ప్రకారమే నేనో ప్రకటన చేశాను. అందరూ అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఏదో జరగబోతోందన్నది వాస్తవం కాదు. రేపు ఏం జరగబోతుందన్నది నాకు తెలియదు. అది నా చేతుల్లో లేదు. ఇప్పటివరకైతే ఆందోళన అవసరంలేదు.

ప్రశ్న: మొదటిసారి భద్రతాపరమైన హెచ్చరిక విడుదలైంది. అది చాలా ఆందోళనకు దారితీసింది.?
యాత్ర కొనసాగించేలా చేయవచ్చు. అయితే యాత్రికులు, పర్యటకుల భద్రత దృష్టిలో పెట్టుకొని ఆ సూచన చేయాల్సి వచ్చింది. ఆయుధాలు, మందుగుండు కనుగొన్నట్లు భద్రతా దళాలు చెప్పాయి. అలాగే భారత్‌లో చొరబడేందుకు సరిహద్దు వద్ద మిలిటెంట్లు ఉన్నట్లు కూడా తెలిసింది. ఇలాంటి ఘటనలు తలెత్తకుండా చేయడానికే ముందస్తు సూచనలు చేశాం. ఇప్పటి వరకూ ఇక్కడికి వచ్చిన ఏ పర్యటకుడికీ ఇబ్బందులు ఎదురు కాలేదు.

ప్రశ్న: రెండు దేశాలూ వారి పౌరులను కశ్మీర్‌కు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశాయి. వాటిని మీరెలా చూస్తారు?
పరిస్థితులు బాగా లేనప్పుడు సైతం వాళ్లు కూడా ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. రాజకీయ కోణంలో ఇలాంటివి చెప్తుంటారు. అందుకు మనం ఏమీ చేయలేం.

ప్రశ్న: జమ్ము కశ్మీర్‌, ముఖ్యంగా లోయలోని ప్రజలకు మీ సందేశమేంటి?
నా సందేశం ఒకటే.. అందరూ ప్రశాంతంగా ఉండాలి. వాళ్లు ఏ విషయం గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. హఠాత్తుగా ఏమీ జరిగిపోదు. ఇప్పటి వరకూ కేంద్రం నుంచి నాకున్న సమాచారం ప్రకారం ఇక్కడ ఏమీ జరగబోవట్లేదు.

ప్రశ్న: రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి?
వాళ్లకేవో వాళ్ల సమస్యలు ఉన్నట్టున్నాయి. ఒకపార్టీ ఇప్పటికే చాలా బలహీన పడింది. మరొక పార్టీ కూడా క్రియాశీలకంగా ఏమీ లేదు. ఎన్నికలు ముందున్నాయి. ఇప్పుడు వాళ్లు ఇలాగే చేస్తారు. ఆ విషయంలో నేను ఏమీ అనుకోను.

ప్రశ్న: ఛడీ ముబారక్‌యాత్ర కొనసాగుతుందా?
ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుంది.

ప్రశ్న: కశ్మీర్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని కరణ్‌సింగ్‌ అంటున్నారు?
ఆయన ఇంతకంటే దారుణ పరిస్థితులు చూశారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడేం జరిగిందని.. ఇక్కడ ఎవరు ఏం చేశారు? మా నేరం ఏంటి? మేము కేవలం మా ప్రజల్ని కాపాడాలని అనుకుంటున్నాం. ఇక్కడకు అమర్‌నాథ్‌ యాత్ర, పర్యాటకం కోసం వచ్చిన వారి భద్రత గురించి ఆలోచిస్తున్నాం. వారి భద్రతకు భరోసా ఇవ్వడం మా బాధ్యత. మరో మూడు రోజులు పార్లమెంటు సమావేశాలు ఉంటాయి. కాబట్టి ఏం జరిగినా రహస్యంగా ఏమీ జరగదు. ఏ విషయమైనా పార్లమెంటు ముందుకు వస్తుంది. వాటిపై చర్చ జరుగుతుంది. కాబట్టి ఊహాగానాలు చేయడం సరికాదు. సోమ, మంగళవారాల వరకూ ఆగండి. తర్వాత ఏదైనా మాట్లాడండి. దిల్లీలో ప్రతి ఒక్కరితో మాట్లాడాను. ఈరోజు వరకూ నాకు ఎలాంటి సమాచారం లేదు. జమ్ము కశ్మీర్‌ను విభజిస్తామని, ఆర్టికల్‌ 35ఎ గురించి, ఆర్టికల్‌ 370 గురించి చాలా ఊహాగానాలున్నాయి. వాటి గురించి ప్రధాని గానీ, హోం మంత్రిగానీ ఏమీ మాట్లాడలేదు.

ప్రశ్న: జమ్ము కశ్మీర్‌ గవర్నర్‌ను దిల్లీ పిలిచారు అనే వార్తలు వస్తున్నాయి?
దిల్లీ రమ్మని ఎవరూ కబురు పెట్టలేదు. నేను దిల్లీ వెళ్లే ప్రయత్నంలో ఉన్నా.. ఈ హడావుడిలో మానుకున్నాను.

Related posts