రాజధాని తరలింపుపై అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళనలు నేడు 74వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు రైతులు శనివారం మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ దీక్షా శిబిరం నుంచి విగ్రహం వరకూ ర్యాలీగా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించేలా సీఎం జగన్ మనసు మార్చాలని కోరుతూ వైఎస్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అమరావతికి మద్దతుగా వెలగపూడిలో కూడా రైతులు, మహిళల దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక, రాజధాని తరలిపోతుందన్న ఆందోళన నేపథ్యంలో మరో ఇద్దరు రైతు కూలీలు మరణించారు. వెలగపూడికి చెందిన సలివేంద్ర సంశోను, రాయపూడికి చెందిన మస్తాన్ అనే రైతు కూలీలు శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు.