telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వరంగల్‌ ప్రజలకు గుడ్ న్యూస్‌ చెప్పిన కేటీఆర్‌…

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చే ఉగాది నుంచి ప్రతిరోజు తాగునీటి సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పైన జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని మంత్రి కే తారకరామారావు హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి మరియు సంక్షేమ కార్యక్రమాల పైన మంత్రి కేటీఆర్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వరంగల్ నగర పరిధిలో తాగునీటి సరఫరాను ప్రతిరోజు ప్రజలకి అందించే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు మంత్రి కేటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఉగాది నుంచి నగర పరిధిలో తాగునీరు ప్రతిరోజు అందించేలా ముందుకుపోవాలని, ఇందుకు సంబంధించి అవసరమైన మౌలిక వసతుల పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వరంగల్ నగరంలో తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
మిషన్ భగీరథ- అర్బన్ ద్వారా పెద్ద ఎత్తున నగరంలో తాగునీటి సరఫరాకు అవసరమైన మౌలిక వసతుల కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గతంలో కేవలం 30 ఎంఎల్డీల నీటి సరఫరా నగరానికి ఉంటే, ప్రస్తుతం 168 ఎం.ఎల్.డీలకి పెరిగిందని, దీంతో పాటు నగరంలో గతంలో 1400 కిలోమీటర్ల పైపులైన్లు ఉంటే దీనికి అదనంగా ఇప్పటికే 1400 కిలోమీటర్లు పైప్ లైన్ల నిర్మాణం పూర్తయిందని, దీంతో పాటు మరో 500 కిలోమీటర్ల పైప్ లైన్ల నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా సుమారు వెయ్యి కోట్ల రూపాయలను వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్లు, వచ్చే ఉగాది నాటికి దాదాపు ఈ పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. ప్రస్తుతం నగరంలో తాగునీటి సరఫరా బలోపేతం కోసం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా 2048 వరకు వరంగల్ నగర ప్రజల తాగునీటి డిమాండ్ ను తట్టుకునేలా రూపొందించడం జరిగిందని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. నగరంలో నీటి సరఫరా వ్యవస్థ బలోపేతానికి అవసరమైన 200 మంది నియామకానికి సంబంధించి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ వారి సహాయంతో వెంటనే రిక్రూట్ చేసుకోవాలని మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రతిరోజు తాగునీరు అందించేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి, అందుకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తయ్యేంతవరకు మునిసిపల్ శాఖ ఇంజనీరింగ్ ఈ ఎన్ సి మరియు ఇతర ఉన్నతాధికారులు ప్రతి వారం ఆయా పనుల పురోగతిని వరంగల్ వెళ్లి సమీక్షించాలని మంత్రి కేటీఆర్ వారిని ఆదేశించారు.
వరంగల్ నగరంలో సుమారు లక్షా 70 వేల గృహాలకు నల్లా కనెక్షన్స్ ఉన్నాయని మిగిలిన గృహాలకు కూడా సాధ్యమైనంత త్వరగా కలెక్షన్లు ఇచ్చేలా, నల్ల కలెక్షన్లను ఒక రూపాయికి తీసుకునేలా ప్రజలను చైతన్యవంతం చేస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని, నగర ప్రజాప్రతినిధులు ఇందుకు సంబంధించిన బాధ్యత తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న సుమారు 3,700 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పురోగతిని కూడా మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సమీక్షించారు. ఇప్పటికే దాదాపు ఎనిమిది వందల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, మెజారిటీ ఇండ్లు నిర్మాణాన్ని పూర్తి చేసుకునే దశలో ఉన్నాయని జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ లు మంత్రులకు తెలియజేశారు. త్వరలోనే పూర్తయిన 800 ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని చేపడతామని మంత్రులు తెలిపారు. దీంతో పాటు నగర పరిధిలో జిల్లా కలెక్టరేట్ తో పాటు మోడల్ జూనియర్ కాలేజ్ వంటి మౌలిక వసతుల నిర్మాణాలు పూర్తయ్యాయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, వీటిని త్వరలోనే ప్రజలకి అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.

Related posts