telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆసీస్ పై విజయం కలా? నిజమా? : రహానే

ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత అది కలా? నిజమా? అనే సందిగ్ధంలో ఉండిపోయానని భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. పెటర్నిటీ లీవ్‌పై బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో‌ని మూడు మ్యాచ్‌లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవ్వగా.. తాత్కలిక సారథిగా రహానే జట్టును నడిపించాడు. సూపర్ కెప్టెన్సీతో పాటు యువ ఆటగాళ్ల అండతో ఆసీస్‌ను సొంతగడ్డపై ఓడించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. గబ్బా టెస్ట్ విజయంపై రహానే మాట్లాడుతూ.. రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్‌ను 20 నిమిషాలు ఓపికగా ఆడమని మాత్రమే చెప్పానని రహానే తెలిపాడు.‘ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఎవరి ఆట వాళ్లు ఆడాలని మేం అనుకున్నాం. అందులో ఎటువంటి సందేహం లేదు. నేను బరిలోకి వెళ్లాక పుజారాతో.. నువ్వు నీలాగే ఆడు. నేను వేగంగా పరుగులు చేస్తానని చెప్పా. ఆ సమయంలో త్వరగా 40 పరుగులు సాధిస్తే తర్వాత మ్యాచ్‌ గెలిచే అవకాశం ఉందని భావించా. 24 పరుగులు చేశాక నేను ఔటయ్యా. పంత్‌ క్రీజులోకి వస్తుండగా.. ‘టీ విరామానికి 20 నిమిషాల సమయముంది. అప్పటి వరకూ జాగ్రత్తగా ఆడు’ అని పంత్‌కు సూచించా. తర్వాత తన సహజసిద్ధమైన ఆట ఆడుకోమని చెప్పా.

ఓడిపోతామనే భయం లేకపోవడమే యువ ఆటగాళ్ల సక్సెస్‌కు కారణమని నేను అనుకుంటున్నా. టీమిండియా తరఫున బాగా ఆడాలనే కసి వారిలో ఉంది. అలాగే ఐపీఎల్‌ కూడా ఉపయోగపడింది. అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడడం లాభపడిందని భావిస్తున్నా. దాంతో రిషభ్‌పంత్‌, వాషింగ్టన్‌, శుభమన్‌ ఇంత పెద్ద టోర్నీలో ఉత్సహంగా బరిలోకి దిగడంతో పాటు రాణించారు. మ్యాచ్‌కు ముందు బౌలర్లను నడిపించే బాధ్యత నీదేనని సిరాజ్‌తో అన్నాను. దాన్ని ఒత్తిడిగా భావించొద్దని, వీలు చిక్కినప్పుడల్లా ఇతర బౌలర్లతో మాట్లాడమని సూచించా. వారికి అవసరమైన సలహాలు, సూచనలు చేయమని కోరాను. టీ విరామం తర్వాత విజయానికి 80 పరుగుల దూరంలో ఉండగా గెలుస్తామనే భావన కలిగింది. చరిత్ర సృష్టించడానికి ఇదే సరైన సమయం. ఇది జీవితకాల అవకాశం. మళ్లీ ఇలాంటి సందర్భం రాదనిపించింది. ఇప్పుడు డ్రా గురించి ఆలోచించకుండా గెలవాలనే భావన కలిగింది. ఆ సమయంలో పంత్‌, వాషింగ్టన్‌ అద్భుతంగా ఆడారు. విజయం కోసం ప్రయత్నించమని వారికెవరూ చెప్పలేదు. అయినా లక్ష్యం దిశగానే సాగారు. విజయానికి 10 పరుగుల దూరంలో ఉండగా.. ఇప్పుడు చరిత్ర సృష్టించేలా ఉన్నామనిపించింది. నాలో భావోద్వేగాలు బయటపడనీయను. ఆ సమయంలో రోహిత్ పక్కన కూర్చున్నా. అతడేమో మనం గెలుస్తున్నాం అనే ఉత్సాహంతో ఉన్నాడు. నేనేమో ప్రతి బంతినీ గమనిస్తూ కూర్చున్నా. ఇది నిజమేనా కాదా అనే ఆశ్చర్యంలో మునిగిపోయా. అదో ప్రత్యేకమైన అనుభూతి. అప్పుడెలా స్పందించాలో అర్థం కాలేదు.

Related posts