telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత జట్టుకు ధన్యవాదాలు తెలిపిన నాథన్ లైయన్…

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ భారత క్రికెట్ జట్టుకు ధన్యవాదాలు తెలిపాడు. తన వందో టెస్టు సందర్భంగా సంతకాలు చేసిన టీమిండియా జెర్సీ అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. కెరీర్‌లో మరిన్ని పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాల్సిన సమయం వచ్చేసిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. బోర్డర్‌-గావస్కర్‌ సిరీసులో భాగంగా గబ్బా వేదికగా జరిగిన ఆఖరి టెస్టు ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్ లయన్‌కు 100వ టెస్టు. ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత అతను ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ వారం రోజులున్నాక తన కెరీర్‌ను సమీక్షించుకున్నాడు. ఆటగాళ్లతో ఎన్నో బంధాలు ఏర్పడ్డాయని, ఆత్మీయత పెరిగిందని పేర్కొన్నాడు.’ఇంటికొచ్చి వారం రోజులు అయ్యాక సమ్మర్ క్రికెట్‌ను రివ్యూ చేసుకునే అవకాశం లభించింది. ఆస్ట్రేలియాకు ఆడటం, బ్యాగీ గ్రీన్‌ అందుకోవడం ఎప్పటికీ నాకు కలే. ఆసీస్‌కు ఒక్క టెస్టు మ్యాచ్‌ ఆడినందుకే నేనెంతో సంతోషంగా భావిస్తాను. అలాంటింది మరో 99 ఎక్కువే ఆడాను. ఆస్ట్రేలియా క్రికెట్‌లోని గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం నాకు దక్కింది.  వారితో జీవితకాల స్నేహం దొరికింది. 100వ టెస్టు ఆడేందుకు బ్రిస్బేన్‌ మైదానంలోకి రావడం వ్యక్తిగతంగా నేనెంతో గర్వించే సందర్భం. అక్కడ అనుకూల ఫలితం సాధించికపోయినా.. ప్రతి రోజూ మెరుగైన క్రికెటర్‌ అయ్యేందుకు నేర్చుకుంటూనే ఉంటాను’ అని లైయన్‌ తెలిపాడు. ‘ఈ సిరీస్‌ గెలిచినందుకు అజింక్యా రహానే, భారత జట్టుకు అభినందనలు. టీమిండియా జెర్సీపై సంతకాలు చేసి బహూకరించింనందుకు, గొప్ప క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినందుకు ధన్యవాదాలు. ఇక మరిన్ని లక్ష్యాలను ఛేదించేందకు సమయం ఆసన్నమైంది’ అని లైయన్‌ పేర్కొన్నాడు.

Related posts