ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ‘వైఎస్సార్ నవోదయం’ పథకం గురువారం ప్రారంభం కానుంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా సుమారు 80,000 యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు సీఎం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ నవోదయం పథకం కింద ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఎల్‌బీసీ లెక్కల ప్రకారం ఎంఎస్‌ఎంఈ యూనిట్లు రూ.4,000 కోట్ల వరకు రుణాలను బకాయిపడ్డాయి. రుణాలు తీర్చలేని యూనిట్లను గుర్తించి వైఎస్సార్ నవోదయం పథకంలో చేర్చే బాధ్యతను కలెక్టర్లు, జిల్లా లీడ్ బ్యాంకులకు ప్రభుత్వం అప్పగించింది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సంస్థలను గుర్తించి పథకంలో చేర్చాలని ఆదేశించింది. దీనిపై ప్రతి జిల్లాలో అవగాహన సదస్సుల ద్వారా ప్రచారం కల్పించేందుకు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
గరిష్టంగా రూ.25 కోట్ల వరకు రుణం తీసుకున్న ఎంఎస్‌ఎంఈలకు ఈ పథకం వర్తిస్తుంది. మొండి బకాయిలుగా మారడానికి సిద్ధంగా ఉన్న ఖాతాలకు వన్‌టైమ్ రీస్ట్రక్చరింగ్ కింద పునరుద్ధరించుకునేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఇందుకు అవసరమైన ఆడిట్ నివేదిక తయారీ వ్యయంలో 50 శాతాన్ని, గరిష్టంగా రూ.2 లక్షల వరకు సాయం చేయనున్నారు. ఈ కంపెనీలకు గత ప్రభుత్వం బకాయి పడ్డ ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రాధాన్య క్రమంలో విడుదల చేస్తారు. టీడీపీ సర్కారు పరిశ్రమలకు సుమారు రూ.3,000 కోట్లు రాయితీలు బకాయి పడిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో చేరేందుకు 2020 మార్చి 31 వరకు అవకాశం కల్పించారు. రిజర్వ్ బ్యాంక్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది.