telugu navyamedia
సినిమా వార్తలు

74 సంవత్సరాల “పల్లెటూరి పిల్ల”

నందమూరి తారకరామారావు గారు తొలిసారిగా హీరోగా నటించిన చిత్రం శోభనాచల ప్రొడక్షన్స్ వారి “పల్లెటూరి పిల్ల” సినిమా 27-4-1950 విడుదలయ్యింది.

దర్శక, నిర్మాత బి. ఏ. సుబ్బారావు గారు స్వీయ దర్శకత్వంలో ఎన్.టి.రామారావు గారిని తొలిసారి హీరోగా పరిచయం చేస్తూ శోభనాచల పిక్చర్స్, బి.ఏ. సుబ్బారావు జాయింట్ ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈచిత్రాన్నికి కధ, స్క్రీన్ ప్లే: బి.ఏ.సుబ్బారావు, సహాయదర్శకుడు: తాపీ చాణక్య, సంగీత దర్శకుడు: పి.ఆదినారాయణరావు, సహాయ సంగీతదర్శకుడు: టి.వి.రాజు, మాటలు: తాపీ ధర్మారావు, ఫోటోగ్రఫీ: డి.ఎస్.కోట్నీస్, నృత్యం: వేదాంతం రాఘవయ్య, కళ: ఎస్.వాలి, టి.వి.ఎస్.శర్మ, ఎడిటింగ్: ఏ.శ్రీరాములు
అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, యస్.వి. రంగారావు, ఏ.వి.సుబ్బారావు, నల్ల రామమూర్తి, బాలసరస్వతి, టి.వి.రాజు, లక్ష్మీకాంతం, హేమలత, తాపీ చాణక్య, టి.వి.రాజు, కృష్ణయ్య తదితరులు నటించారు.

సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారి సంగీత సారధ్యంలో
“పారవే జోరుగా జోరుగా నీతోనే ఏతాము”
“శాంత వంటి పిల్ల లేదోయి”
“నా జబ్బ సత్తువ చూసేవా”
వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఎన్టీఆర్, అక్కినేని కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం “పల్లెటూరి పిల్ల” కాగా ఎన్టీఆర్ గారికి మాత్రం ఇది మూడవ చిత్రం ఐనప్పటికి హీరోగా నటించిన మొట్ట మొదటి సినిమా ఇదే కావటం విశేషం. అయితే హీరో గా విడుదలైన మొదటి చిత్రం “షావుకారు”.

ప్రతి పాత్రకూ తగిన ప్రాముఖ్యతనిచ్చి కథకూ సన్నివేశానికీ మంచి బిగువును కల్పించాడు దర్శకుడు బి.ఏ.సుబ్బారావు.గారు పల్లె వాతావరణమూ, వారి ఆచారాలు, సంప్రదాయాలు, మంచీ చెడూ చాలా చక్కగా చిత్రీకరించారు.

తాపీ ధర్మారావు గారు మంచి సంభాషణలు అందించారు. ఆదినారాయణరావు గారు అందించిన సంగీతం పల్లెటూరి వాతావరణానికీ, కథకూ, గమనానికీ బాగా సరిపోయింది.

ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎద్దు తో ఫైట్ చిత్రీకరించే సమయంలో ఎన్టీఆర్ గారు డూప్ లేకుండా నటించారు.

అప్పుడు ఎద్దు కొమ్ములతో ఎన్టీఆర్ ను విసరడంతో కుడి చేతి ఎముక ఫ్రాక్చర్ అయ్యింది. కాగా చేతికి గాయమైనప్పటికి ఎన్టీఆర్ మరుసటి రోజే షూటింగ్ లో పాల్గొన్నారు.

ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన తొలి చిత్రమే ఘన విజయం సాధించడం తో తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక మంచి హీరో లభించాడు అని అప్పడు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.

ఈ చిత్రం తొలి విడత 10 కేంద్రాలలో విడుదలై మంచి విజయాన్ని సాధించి 6 కేంద్రాలలో డైరెక్ట్ గా 100 రోజులు ప్రదర్శింపబడి శత దినోత్సవం జరుపుకున్నది.

ఒక కేంద్రం లో రజతోత్సవం (175 రోజులు) జరుపుకున్నది.
ఈ చిత్రం విడుదలైన కేంద్రాలు:-
1)విజయవాడ — శ్రీలక్ష్మి,
2)గుంటూరు — న్యూసిటి( లిబర్టి),
3)ఏలూరు — గోపాలకృష్ణ,
4)భీమవరం — వెల్ కమ్,
5)రాజమండ్రి — శ్యామల,
6)కాకినాడ — మెజెస్టిక్,
7)విజయనగరం — పూర్ణా,
8)తెనాలి — స్వరాజ్,
9)మచిలీపట్నం — బృందావన్,
10)సికింద్రాబాద్ — మినర్వా కేంద్రాలలో విడుదల అయ్యింది.

అప్పట్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు కు కలిపి ఒక్కటే సెంటర్ లో సినిమాలు విడుదల కావటం జరిగేది.
సికింద్రాబాద్ మినర్వా లో 71 రోజులు ఆడింది.
విజయవాడ శ్రీ లక్ష్మీ టాకీస్ లో 142 రోజులు ఆడింది.
ఈ చిత్రం 100 రోజుల ప్రదర్శింపబడిన కేంద్రాలు:-
1. విజయవాడ — శ్రీలక్ష్మి (142 రోజులు),
2. గుంటూరు — న్యూసిటి ( లిబర్టీ),
3. తెనాలి — స్వరాజ్,
4. రాజమండ్రి — శ్యామల,
5. కాకినాడ – మెజెస్టిక్,
6. విజయనగరం – పూర్ణా
ధియేటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడింది…..

Related posts