telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉదయ్ కిరణ్ చాలా సరదాగా ఉండేవాడు… సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు…

vuday-kiran

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు ఉదయ్ కిరణ్. ‘చిత్రం’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తిచేశాడు. ఈయ‌న‌ దూకుడు చూసి చిరంజీవి కూడా తన అల్లుడు చేసుకోవాలని ఆరాటపడ్డాడు. అద్భుతమైన కెరియర్ కళ్ళముందు కనిపిస్తుండగా ఒకే ఒక్క సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. కారణాలు తెలియదు కానీ ఉదయ్ కిరణ్ కెరీర్ మాత్రం ఉన్నట్టుండి తలకిందులైపోయింది. అప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఉదయ్ కిరణ్ 2004 తర్వాత పూర్తిగా పడిపోయాడు. పదేళ్ల పాటు తన సినిమా కెరీర్‌ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన నటుడు.. జీవితంలో విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఓ యువ హీరోను చిధిమేశారు అంటూ అప్పట్లో నానా రచ్చ జరిగింది కూడా. ఈయన దూరమై 6 ఏళ్లు గడుస్తున్నా.. ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఉదయ్ కిరణ్ అలాగే ఉండిపోయాడు. ఇప్పుడు ఈయన గురించి సునీల్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో ఉదయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు ఈ కమెడియన్. ఈ ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. సునీల్ కెరీర్ మొదట్లో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్, హోలీ లాంటి సినిమాల్లో ఉన్నాడు. నువ్వు నేను షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకున్నాడు సునీల్. ఆ సినిమాలో ఓ రన్నింగ్ రేస్ సమయంలో నిజమైన రన్నర్‌లను తీసుకొచ్చాడు దర్శకుడు తేజ. వాళ్లతో కలిసి ఉదయ్ కిరణ్‌ను పరిగెత్తాలని కోరాడు. వాళ్లతో నిజంగానే పరిగెత్తి ఫస్ట్ వచ్చాడు ఉదయ్.. దాంతో సునీల్ వెళ్లి అంత స్పీడ్‌గా ఎలా పరిగెత్తావని ఉదయ్‌ని అడిగితే.. చిన్నప్పుడు బస్సుల వెంట పరుగెత్తి అలవాటు అయిపోయిందని సరదా సమాధానం చెప్పాడు. షూటింగ్‌లో అంత సరదాగా ఉండే మనిషి తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జీర్ణించుకోలేకపోయానని చెప్పాడు సునీల్.

Related posts