telugu navyamedia
రాజకీయ

అన్నాడీఎంకే నుంచి…పన్నీర్ అవుట్.. పళనిస్వామికి పార్టీ పగ్గాలు

*పార్టీ ముఖ్య‌ప‌ద‌వులు, స‌భ్య‌త్వం నుంచి తొల‌గింపు

*ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి

ఏఐఏడీఎంకే సీనియర్ నేత పన్నీర్‌సెల్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నుంచి బహిష్కరిస్తూ సర్వసభ్య సమావేశం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఓపిఎస్ ను పార్టీ ముఖ్య‌ప‌ద‌వుల నుండి తొలగించడమే కాదు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దుచేయాలని పార్టీ ప్రకటించింది. అంతేకాదు పన్నీర్ సెల్వంతో పాటు ఆయన అనుచరులను కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అన్నాడీఎంకే స్పష్టం చేసింది. అంతేకాకుండా ఓపీఎస్‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంది

నేటి స‌ర్వ‌స‌భ్య‌ సమావేశంలో 16 తీర్మానాలకు జనరల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని నియమించడం కూడా ఇందులో ఉంది. దీంతో పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతులోకి చేరాయి .

ఇక, నాలుగు నెలల్లో ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక నిర్వహించాలని జనరల్ కౌన్సిల్ కూడా తీర్మానం చేసింది. పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని తొలగించి, పార్టీకి డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని సృష్టించాలని జనరల్ కౌన్సిల్ తీర్మానం చేసింది.

కాగా గతకొన్ని రోజులుగా… పళనిస్వామి, పన్నీర్ సెల్వం ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే.

పళనిస్వామి శాసనసభ పక్ష నేతగా కొనసాగుతున్నారు. పన్నీర్ సెల్వం తనకు పార్టీ బాధ్యతలను అప్పగించాలని కోరుతున్నారు. అందుకు పళనిస్వామి అంగీకరించడం లేదు.

పన్నీర్ కు పార్టీలో కీలక పదవి ఇస్తే శశికళ సులువుగా ఎంట్రీ ఇస్తుందన్న అనుమానంతో ఆయనను దూరంగా ఉంచాలని నిర్ణయించారు. దీంతో పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మ‌రోవైపు జయలలిత మృతి తర్వాత పార్టీలో కొనసాగుతున్న ద్వంద్వ నాయకత్వ విధానాన్ని ఈ సమావేశంలో రద్దు చేశారు. పార్టీ కోఆర్డినేటర్, సంయుక్త కోఆర్డినేటర్ పోస్టులను రద్దు చేశారు. దీంతో పార్టీ నాయకత్వ పగ్గాలు ఎవరైనా ఒక్కరే చేపట్టే అవకాశం ఉంటుంది. గతంలో పళనిస్వామి, పన్నీర్​సెల్వం పార్టీ పగ్గాలు పంచుకున్నారు. ఇక తాజాగా ఈ సంప్రదాయానికి తెరపడింది.

Related posts