మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడిగా సాధ్వి ప్రజ్ఞా సింగ్ అభివర్ణించిన విషయం తెలిసిందే. బీజేపీ నాయకురాలు, భోపాల్ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ గాడ్సే పై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెనుదుమారాన్ని లేపాయి. ఆమె వ్యాఖ్యలను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. తాజాగా ఆమె వ్యాఖ్యల పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటు విమర్శలు చేశారు.
మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించిన సాధ్వి ముమ్మాటికీ ఉగ్రవాదేనని ఆయన అన్నారు. గాంధీని చంపినవారిని దేశ ప్రజలంతా ఉగ్రవాదిగానే భావిస్తారని అన్నారు.
అలాంటి హంతకులను దేశభక్తులుగా చూసే వారు కూడా ఉగ్రవాదులేనని దుయ్యబట్టారు. స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది హిందువే అంటూ ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ నేపథ్యంలోనే గాడ్సే దేశభక్తుడంటూ సాధ్వి మరో వివాదానికి తెరతీశారు. ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ అధిష్ఠానం కూడా సీరియస్ కావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. ఆమె పై క్రమశిక్షణ చర్యలకు బీజేపీ హైకమాండ్ సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.