telugu navyamedia
రాజకీయ

అన్నాడీఎంకేలో విభేదాలు : పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గీయులు పరస్పరం దాడి..

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో చెన్నై రాయపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది.

పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కొందరికి తీవ్ర గాయలయినట్లు తెలుస్తోంది.

సమీపంలోని పార్క్ చేసిన పలు వాహనాలను కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే శ్రేణులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

పళనిస్వామి నేతృత్వంలోని జనరల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వెలుపల పన్నీర్ సెల్వం మద్దతుదారులు నిరసన తెలిపారు.

పళనిస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పళనిస్వామి ఫోటోపై చెప్పుతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పార్టీ కార్యాలయాన్ని పన్నీర్‌ సెల్వం( ఓపీఎస్‌) వర్గం స్వాధీనం చేసుకుంది. తన వర్గం నేతలతో ఓపీఎస్‌ సమావేశమైంది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. దీంతో అన్నాడీఎంకే ఆఫీస్‌ దగ్గర 144 సెక్షన్‌ విధించారు.

దివంగత జయలలిత జైలు వెళ్లాల్సి వచ్చిన సమయంలో పన్నీరు సెల్వంకు స్టాండ్-ఇన్-చీఫ్ మినిస్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆమె చనిపోయేముందు కూడా పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. అయితే కొంతకాలం పాటు పార్టీని ఆధీనంలోకి తీసుకున్న జయలలిత సన్నిహితురాలు శశికళ.. తిరుగుబాటు చేయడంతో పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

AIADMK Meeting Of Top Office Bearers Violates Party By-Law: O Panneerselvam - Indiaahead News

అయితే శశికళ జైలులో ఉన్న సమయంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గీయులు ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక, ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల కాలంలో పళనిస్వామి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని పార్టీని తన అధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల్లో పార్టీ వరుస ఓటముల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మోడల్ కరెక్ట్ కాదని పళనిస్వామి చెబుతున్నారు. ఆయనకు పార్టీలో మద్దతు భారీగా ఉంది. మరోవైపు పార్టీపై నియంత్రణ కోసం పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

చట్టాన్ని అనుసరించి జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని కొనసాగించడానికి పళనిస్వామి వర్గానికి సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే పన్నీర్ సెల్వం వర్గం మాత్రం.. ఈ సమావేశం నిర్వహణ సాంకేతికంగా చట్టవిరుద్ధమని, అందువల్ల చెల్లదని వాదిస్తుంది. బైలా ప్రకారం కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ మాత్రమే సమావేశాన్ని ఏర్పాటు చేయగలరని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు.

Related posts