telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఈ సినిమా సమాజాన్ని కదిలిస్తుంది

కదిలేది కదిలించేది
మారేది మార్పించేది
పెను నిద్దుర వదిలించేది
మునుముందుకు నడిపించేది
కావాలోయ్ నవ కవనానికి .””
అన్నారు మహాకవి శ్రీశ్రీ
“” కావాలోయ్ నవ సినిమాకు “”
అంటుంది నేటి సినిమా ప్రేక్షక ప్రపంచం.
“” సినిమాలు
రాత్రి బడులు .””
అన్నారు తొలితరం తెలుగు సినిమా దిగ్గజం
బి . ఎన్ . రెడ్డి గారు.!
“” నిశిరాత్రి నీడలు మాట్లాడేనయా “”
అని ఆనాడే భవిష్యత్ పరిణామాన్ని ప్రకటించేశారు శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రుడు.!
“” సెకనుకు 24 ఫ్రేములు చొప్పున నిజాన్ని
నిర్భయంగా వివరిస్తుంది సినిమా “” అన్నారు గొడార్డ్!
ఈ ఉవాచలన్నీ , యీ ఉద్ఘాటనలన్నీ సినిమా
అనే మూడక్షరాల గొప్పదనాన్ని , సామాజిక సాంఘీక ప్రయోజనాన్ని ఎలుగెత్తి చాటుతున్నాయి.!!
కళల లక్ష్యం ప్రజా చైతన్యం.
కళల గమ్యం ప్రజా ప్రయోజనం .
ఈ లక్ష్యం దిశగా ప్రజా కళాకారుడు “” అజయ్ ఘోష్ “” పర్యవేక్షణ లో రూపొందించబడినదే
“” రుద్రమాంబపురం “” .!
ప్రధాన పాత్ర ను కూడా ఆయనే పోషించారు.!!
మూలవాసుల కధ అనేది దీని క్యాప్షన్.
అవును యిది మూలవాసుల కధే .
మన మూలాలను మనముందు ఆవిష్కరించే కధ .
సమాజంలో ఒక భాగమైన సముద్రజీవుల అంటే
చేపలు పట్టుకొని జీవించే చేపలోల్ల కధ .
అన్ని వర్గాల ప్రజల మాదిరిగానే రకరకాల దోపిడీకి… రకరకాల దాష్టికాలకు , రకరకాల కష్ట
నష్టాలకు గురవుతున్న మత్స్యకారుల కధ.
ఈ సినిమాకు కధను అందించింది ప్రముఖ బహుబాషా నటుడు “” అజయ్ ఘోష్ “”.
ఈయన కరడు కట్టిన విలన్ పాత్రధారిగా , ప్రజల హక్కులను కాలరాసే దుర్మార్గుడైన విలన్ గా మాత్రమే చాలామందికి తెలుసు.
కానీ
నిజ జీవితంలో సమాజంలోని విలన్ లకు , విలనిజానికి వ్యతిరేకంగా జరిగిన, జరుగుతున్న
ప్రజా ఉద్యమాలలో పాల్గొన్న వ్యక్తి .
తరతరాల దోపిడీకీ ,దుర్మార్గాలకు గురయి రోధనలతో , వేధనలతో రొప్పుతున్న , మూలుగుతున్న సగటు మనుషుల తరుపున
పోరాటం సాగిస్తున్న వామపక్ష కమ్యూనిస్టు
ఉద్యమం నుండి , ప్రజానాట్య మండలి …ప్రజా
కళామండలి వంటి జనం గుండె చప్పుళ్ళ సాంస్కృతిక ఉద్యమం నుండి వెండితెర వైపు
అడుగులు వేసిన ప్రజా కళాకారుడాయన.!
వామపక్షాల పక్షపాతి ఆయన.!!
ప్రజా పక్షపాతి ఆయన.!!
అందుకే.
ఆ ఉద్యమ స్పూర్తి తోనే ఎవరూ పట్టించుకోని ,
ఎవరికీ తెలియని మూలవాసులు ఎదుర్కొంటున్న
సమస్యలను సమాజం దృష్టికి , ప్రభుత్వం దృష్టికి
తీసుకొచ్చి తనవంతు కృషిగా సదరు సమస్యల
పరిష్కారం కోసం ఏదైనా చేయాలనే తపనతో ,
సదాశయంతో తనతో కలిసొచ్చే కొందరు మిత్రులను కలుపుకొని ఈ “” రుద్రమాంబపురం “”
అనే ప్రయోజనాత్మక చిత్రాన్ని రూపొందించి
ప్రజల ముందుకు తీసుకొచ్చాడాయన.
ప్రస్తుతం ప్యాన్ ఇండాయా ఆర్టిస్టుగా బిజీ షెడ్యూల్ లతో , షూటింగులతో బిజీగా వున్న ” అజయ్ ఘోష్ “” కళల ద్వారా , సినిమాల ద్వారా
తన చుట్టూ వున్న సమాజానికి ఏదైనా చేయాలనే
తపనతోనే , ఆశయంతోనే యీ సినిమా రూపకల్పనను భుజాన వేసుకున్నారు .!
అందుకే కెమెరాను తీసుకెళ్ళి సముద్రం ముందు.
సముద్ర వాసుల ముందు ఇసుక తెన్నెలలో పాతేశాడు.!
ప్రపంచీకరణ పిదప ప్రజల జీవన విధానాలు..జీవన ప్రమాణాలు మారిపోయాయి.!
సమస్యలు పెరిగిపోయాయి.!
దోపిడీలు దురంతాలు పెరిగిపోయాయి .!!
అదే సమయంలో సామాజిక స్పృహ పెరిగిపోయింది .
కొత్త ఆలోచనలు మొలకెత్తడం మొదలయింది.
కొత్త అధ్యాయాలు ప్రారంభం అయ్యాయి.
మా హక్కుల పత్రంపై దొంగ సంతకాలు , మా
అన్నం మెతుకులపై దోపిడి హస్తాలు ఎవరివి అవి ఎవరివని ప్రశ్నించే గళాలు పురుడు పోసుకుంటున్నాయి….!!
సోవియట్ రష్యాలో గ్లాస్ నోస్తా , పెరిస్ట్రోయికా
వంటి సంఘటనలు జరిగాకా ప్రపంచ వ్యాపితంగా
మానవజీవితం మారిపోయింది.
ఒడుదుడుకులు ఎక్కువయిపోయాయి.!!!
ప్రపంచీకరణ విషనాగులు చిమ్మిన విషం కారణంగా మానవజీవితంలో జరగరానివి ,
జరగవలసినవి హుటాహుటిన జరిగిపోసాగాయి.!
ఈ నేపధ్యంలో బడుగు బలహీన వర్గాల
గుడిసెల్లోకి గుండెల్లోకి తొంగి చూస్తే ఎన్నో
కొత్త కధలు , ఎన్నెన్నో సరికొత్త జీవన కధనాలు
తారసపడతాయి.
అవి ప్రస్తుతం దిగుబడవుతున్న మూస సినిమాలకు భిన్నంగా , మన కళ్ళ లోగిళ్ళ ముందు
ఆవిష్కరింపబడతాయి అని వర్తమాన వెండితెర
ప్రకటించకనే ప్రకటిస్తుంది.
ప్రపంచ సినిమా మాద్యమ పరిణామక్రమం ఇదే.!!
తెలుగు తెర అడుగులు కూడా ఆటువైపే.!
“” బలగం “” వంటి మట్టి మనుషుల కధలతో
మట్టివాసనను వెదజల్లుతూ .
సినిమా కోసం జనం కాదు .జనం కోసం సినిమా
అనే నినాదాన్ని నలుదిశలా ప్రతిధ్వనింపజేస్తుంది
తెలుగు తెర. !!
అదిగో
అటువంటి ప్రయత్నమే యీ ” రుద్రమ మాంబపురం” .!!
ఈ సినిమాలో స్టార్ లు లేరు ….భారీ భారీ
సెట్టింగులు లేవు…..పాత్రలు ఆకాశంలో విహరించవు….పడికట్టు పదాల డైలాగులు లేవు……
కానీ సముద్రం వుంది….
సముద్రం లాంటి జీవితం వుంది….!
చేపలున్నాయి….
చేవ చచ్చిన జీవులున్నారు ….
సముద్రపు నీటిలో కలిసి ఉప్పగా మారుతున్న
కన్నీరు వుంది…..
సముద్రపు హోరులో రాగాలను వెదుక్కుంటున్న
దిక్కుమొక్కులేని పాట వుంది….
నటులెవరూ నటించలేదు…
నటనలో జీవించలేదు…..
సహజంగా ప్రవర్తించారంతే…..
ఈ సినిమాలో ప్రధాన పాత్ర అజయ్ ఘోషో ,
రాజశేఖరో, నండూరి రామో , రజనీ శ్రీకళో కాదు…..
సాక్షాత్తు సముద్రమే….
అవును సముద్రమే అసలు పాత్ర….
అయితే
ఆ సముద్రాన్ని ఢీకొంటూ నటించాడు అజయ్ ఘోష్….
ఒక్కోసారి తెరపైన ఒకే ఫ్రేమ్ లో సముద్రం మరియు అజయ్ ఘోష్ కనిపించినప్పుడు
రెండు సముద్రాలు మన కళ్ళముందు కదలాడుతున్న భావన మనకు కలుగుతుంది…..!
ఒక ఎస్వీ రంగారావు, ఒక సత్యనారాయణ, ఒక
కోట శ్రీనివాస రావు ,ఒక కొంగర జగ్గయ్య , ఒక ఓంపూరి , ఒక అమ్రేష్ పూరి , ఒక నషీరుద్దీన్ షా
లు మన తలపుల్లోకీ మన అనుమతి లేకుండానే తొంగిచూస్తారు అజయ్ ఘోష్ ను , అతని నటనను చూస్తుంటే…..!
నిర్మాత , నటుడు నండూరి రామును , ఆయన నటన తాలుకూ హావభావాలను చూస్టుంటే
హాస్య బ్రహ్మ బ్రహ్మనందం గారి ఛాయలు ప్రతి వారికి తప్పకుండా కనిపిస్తాయి……
ఇటువంటి కధలను ఎంచుకున్నందుకు దర్శక
సోదరుడు “” మహేష్ బంటు “” కు కోటి చేతులతో
షేక్ హ్యాండ్స్ యివ్వండి…..!!
“” కధలు మారవు….
మనం కధలు చెప్పే తీరు మారాలి…..
మనం ఎన్నుకునే కధాంశాలు మారాలి…..””
అంటాడు సిడ్నీ పొల్లాక్…..!
ఈ “” రుద్రమాంబపురం ” సినిమాను చూస్తుంటే….
యిదే బాటలో యీమధ్య కాలంలో వచ్చే సినిమాలను చూస్తుంటే సిడ్నీ పొల్లాక్ చెప్పిన
మాటలే గుర్తొస్తాయి……!
సినిమా ప్రియులారా….ప్రేక్షక సోదరులారా
ఈ సినిమాను తప్పకుండా చూడండి…..
ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబడిన
సినిమా కాదు….
ఒకానొక అంకితభావంతో నిర్మించబడిన సినిమా. …!!!
ఈ సినిమానే కాదు యిటువంటి సినిమాలను
ఒక బాధ్యత గా చూసి ఆదరించండి…..
రోత పట్టిన పాత బూజు కధల సినిమాలకు,
సమాజాన్ని చెడగొట్టే సినిమాలకు పాతర
పెట్టండి……!
కొత్త నీరుకై దోసిళ్ళు పట్టండి……!!

…….. బాబ్జీ
సినీ దర్శకుడు

Related posts