telugu navyamedia
తెలంగాణ వార్తలు

జాతీయ పార్టీ లేదు…. ఫ్రంట్ వైపే మొగ్గు

*మోదీపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
*మోదీని గద్దె దించి.. కుంభకోణాలపై విచారణ
*షిండేలను ఉత్పత్తి చేయడమే మీ పనా.?
*కేంద్రంలో టీఆర్‌ఎస్‌ తరహా ప్రభుత్వాన్ని తెస్తాం
*నేను ఫైటర్‌ను.. జాతీయ పార్టీ వస్తది
*జాతీయ పార్టీ లేదు…. ఫ్రంట్ వైపే మొగ్గు

జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దాదాపు రెండున్నర గంటల పాటు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు.

పార్టీకి బదులు భావసారూప్యత గల పార్టీలతోనే ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఫ్రంట్ తోనే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

మూడు, నాలుగు పార్టీలు కలిపి ఫ్రంట్ పెడితే ఏమొస్తుందని ఆయన ప్రశ్నించారు. ఆ కిచిడీ ఫ్రంట్ నాలుగు నెలలు కూడా నడవదని అంటారని … అందుకే దేశ ప్రజల్ని సమాయత్తం చేస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.

అవసరమైతే టీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా మారుతుందని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘‘కొందరు జాతీయ పార్టీపై అలానే విమర్శలు చేస్తరు. టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినప్పుడు ఇలానే అన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఎక్కడుందో కనిపించడం లేదా? కొత్త పార్టీ దేశంలో రావొద్దా? ఎందుకు రావొద్దు? వాళ్లేమైన గుత్తపట్టుకున్నారా?’’ అని కేసీఆర్‌ నిలదీశారు.

తెలంగాణలో మాదిరిగా గొప్ప ప్రాజెక్టు కట్టుకోలేమా? దేశంలో అద్భుత ప్రగతికి శ్రీకారం చుట్టాలి. బీజేపీ ఓట్లతోనే రాష్ట్రపతిని గెలిపించుకునే అవకాశం వాళ్లకే లేదని కేసీఆర్ వెల్లడించారు.

కేసీఆర్‌ ఫైటర్‌..

జైళ్లకు కేసులకు ఎవరు భయపడ్తారు. ఈ వయసులో నేనేందుకు భయపడుతా. నా మీద కూడా ఒకటి, రెండు కేసులు పెడ్తారేమో. న్యాయస్థానాలున్నాయి. న్యాయం బతికే ఉంది. కేసీఆర్‌ ఫైటర్‌. కేసులతో ఏం కాదు. మా దాంట్లో ఈడీ కేసులు పెట్టేంత దొంగలు లేరు? మేం కుంభకోణాలు చేయలేదు. బీజేపోళ్ల లొల్లిని ఎవరూ నమ్మరు’’ అని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఒక్కరిద్దరు బీజేపీలోకి వెళ్తే తమ పార్టీకి నష్టం లేదన్నారు.

 

ప్రశాంత్ కిశోర్ తనకు ఫ్రెండ్ మాత్రమేనని.. ఆయన నాకు చెప్పేదేం వుంటుందన్నారు. అలాంటి వాళ్లు తనకు చాలా మంది ఫ్రెండ్స్ వున్నారని… కుటుంబ పార్టీలను తొలగించాలంటే ప్రజలు తొలగించాలని, మధ్యలో బీజేపీ ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమా..? ఈస్ట్‌మన్ కలర్ కలలు కంటున్నారంటూ కేసీఆర్ సెటైర్లు వేశారు. దిక్కుమాలిన వాళ్లు పది పదిహేను మంది పోతే ఆ పార్టీకి పోపతారని ఆయన దుయ్యబట్టారు.

తెలంగాణ ప్రజలు మమ్మల్ని వదులుకోరని, ఆ విషయం తమకు తెలుసునంటూ కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి రాజీనామా చేసినా మా దాంట్లో ఒక్క వికెట్టూ పోలేదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించి తీరతామని సీఎం స్పష్టం చేశారు.

Related posts