telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేను అసెంబ్లీ ర‌ద్దు చేస్తా..ద‌మ్ముంటే ఎన్నిక‌లు తేదీ ఖ‌రారు చేయండి

విపక్షాలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. ముందస్తు ఎన్నికలకు తాను సిద్ధం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్​… ముందస్తు ఎన్నికలపై స్పందించారు.

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం లేదని..ప్రభుత్వాలను గెలిపించేది, ఓడించేది ప్రజలు.. వ్యక్తులు కాదని , ఒకవేళ వ్యక్తులనుకుంటే.. వాళ్లు వెర్రివెంగళప్పల కింద లెక్కగట్టాల్సి వస్తుంద‌ని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో నేను ఓడిస్తా అనే మాట మాట్లాడొచ్చా.? రాష్ట్రంలోబీజేపీ, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా..? దమ్ముంటే ఎన్నికల తేదీ ఖరారు చేయమనండి.. నేనే అసెంబ్లీ రద్దు చేస్తా..! ఇలాంటి కురస మాటలతో కేసీఆర్​ను కొట్టలేరని విపక్షాలకు చాలెంజ్‌ విసిరారు

మేకిన్ ఇండియా ఘోరమైన అట్టర్ ఫ్లాప్ అంటూ బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పిల్లలు ఆడుకునే పతంగి మాంజాల నుంచి జాతీయ పతాకాల దాకా అన్నీ చైనావేనంటూ కేసీఆర్ చురకలు వేశారు. ఇదేనా మేకిన్ ఇండియా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టడమే బీజేపీ పని అంటూ కేసీఆర్ ఆరోపించారు. బీజేపీ పాలనలో ఆర్ధిక వ్యవస్థ నాశనం అయ్యిందని… పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా తరలి వెళ్లిపోతున్నాయని సీఎం గుర్తుచేశారు.

బీజేపీ వస్తే రైతు బీమా, రైతు బంధు ఇస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. కోర్టులు, జర్నలిస్టులంటే కేంద్రానికి గౌరవం లేదని సీఎం మండిపడ్డారు. తెలంగాణలోనూ ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తామని చెబుతున్నారని.. బీజేపీ నేతలు ప్రజాస్వామ్య హంతకులు కారా అని కేసీఆర్ ప్రశ్నించారు. బ్యాంకు దొంగల్ని ఎందుకు పట్టుకోవడం లేదని సీఎం నిలదీశారు. బ్యాంకు దొంగల్లో మీరూ భాగస్వాములేనని కేసీఆర్ ఆరోపించారు. బ్యాంకు దొంగలను దేశానికి తీసుకురావడం మీకు చేతకాదా అని ఆయన నిలదీశారు.

Related posts