telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జర్నలిస్ట్ గా రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న రేవంత్ రెడ్డి మూడు దశాబ్దాల క్రితం జర్నలిస్టుగా పనిచేశారు .
కందనాతి చెన్నారెడ్డి ప్రారంభించిన పల్లకి వారపత్రికలో కొంత కాలం రేవంత్ రెడ్డి ఆర్టిస్టుగా పనిచేశారు. ఆ తరువాత వడ్లమూడి రామమోహన్ రావు సంపాదకత్వంలో వెలువడిన జాగృతి వార పత్రికలో లే అవుట్ ఆర్టిస్ట్ గా పనిచేశారు . ఆ తరువాత నారాయణగూడ లో స్వంత ప్రింటింగ్ ప్రెస్సును ప్రారంభించారు. 2006లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణ శాసన సభ కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది . 2021జూన్ లో తెలంగాణ  కాంగ్రెస్ కమిటీలో అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి ఆ పార్టీ సారధిగా ఘన విజయాన్ని సాధించారు .

రేవంత్ రెడ్డి జీవిత ప్రస్థానం..
అనుముల రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న అనుముల నరసింహ రెడ్డి, రామ చంద్రమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం లోని నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డిపల్లి గ్రామం లో జన్మించారు . ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ నుండి 17వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యుడు.

2009 మరియు 2014 మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరియు 2014 మరియు 2018 మధ్య తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నుండి కొడంగల్ నియోజక వర్గంలో రెండు సార్లు శాసన సభ్యుడిగా ఉన్నారు.
తెలుగు దేశం పార్టీలో వున్నప్పుడు అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు నుంచి తాను ఎన్నో నేర్చుకున్నని , ఆయన తన గురువు గర్వంగా చెప్పుకుంటారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఆ పార్టీ విజయానికి దోహదం చేశాయి .

Related posts