telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్ .టీ .ఆర్ గురు దక్షిణ “ఏకవీర”

నందమూరి తారకరామారావు గారు నటించిన మనోహర దృశ్యకావ్యం “ఏకవీర” చిత్రం. ఈ సినిమా 54 సంవత్సరాల క్రితం అంటే 1969 డిసెంబర్ 4న విడుదలయ్యింది.

ఎన్టీఆర్ గారి గురుతుల్యులు తొలి తెలుగు ఙ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన “ఏకవీర” నవలను నిర్మాత డి.ఎల్.నారాయణ గారు పద్మా ఫిలింస్ బ్యానర్ పై సియస్.రావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు గొప్ప నవల రచయిత అని అందరికీ తెలుసు. అయితే ఆయన విజయవాడ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు . అప్పుడు రామారావు గారికి వారు గురువు.

విశ్వనాథవారు వ్రాసిన నాగమ్మ అనే నాటికలో రామారావు గారు నటించారు . ఆ నాటికలో మీసాలతో నటించడం వల్ల రామారావు ను స్నేహితులు మీసాల నాగమ్మ అని పిలిచేవారు. విశ్వనాథ వారంటే రామారావు గారికి ఎంతో అభిమానం గౌరవం. అందుకే వారు వ్రాసిన ఏకవీర నవలను సినిమాగా రూపొందించారు.

ఈ చిత్రంలో సేతుపతి గా ఎన్.టి.రామారావు, వీర భూపతి గా కాంతారావులు ప్రాణ స్నేహితులుగాను, ఏకవీరగా కెఆర్.విజయ, మీనాక్షిగా జమున, మిగతా పాత్రలకు సత్యనారాయణ, ధూళిపాళ, మిక్కిలినేని, శివరాం, మీనాకుమారి, శాంతకుమారి, శ్రీరంజని, నిర్మల, రాజసులోచన, రాజ బాబు, ముక్కామల, బేబి పద్మిని గారు నటించారు.

సినిమా రంగానికి గులేబకావలి కథ సినిమా ద్వారా పాటల రచయితగా పరిచయం చేసిన డాక్టర్ సి .నారాయణ రెడ్డి గారితో మాటలు వ్రాయించారు. ఈసినిమాకు సంగీతం: కె.వి.మహదేవన్, ఫోటోగ్రఫీ: జె.సత్యనారాయణ, పాటలు: సి.నారాయణరెడ్డి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కళ: గొడ్ గాంకర్ – వాలి, నృత్యం: వెంపటి సత్యం, కూర్పు: పి.వి.నారాయణ సమకూర్చారు.
మల్లీశ్వరి సినిమాకు మాటలు వ్రాసిన దేవులపల్లి వారు, ఏకవీర కు మాటలు వ్రాసిన సి.నారాయణ రెడ్డి ఈ సినిమాకు పాటలు వ్రాయడం విశేషం.
“తోటలో నారాజు తొంగిచూసెను నాడు”
“ప్రతీరాత్రి వసంతరాత్రి”
“ఒక దీపం వెలిగింది ఒక రూపం వెలిసింది”
“ఎంత దూరమో అది ఎంత దూరము”
“ఏ పారిజాతమ్ములు ఈయగలనే చెలీ”
లాంటి సాహిత్యం, సంగీతం గుబాళించే పాటలు ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తాయి. ఈ చిత్రాన్ని చూసిన విశ్వనాధ సత్యనారాయణ తన శిష్యుడు ఎన్టీఆర్ ను, మెచ్చుకొని గురు దక్షిణ ఇచ్చావు అన్నారు.

Related posts