కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10మంది చిన్నారులతో సహా 30మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి యానాం వెళ్తున్న రమణ ట్రావల్స్ కు చెందిన బస్సు యానాం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. గాయపడిన వారిలో పదిమంది వరకు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన చిన్నారుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. డ్రైవర్‌కు ఎన్నిసార్లు హెచ్చరించిన లెక్క చేయకుండా బస్సు వేగంగా నడిపాడని ప్రయాణికులు వాపోతున్నారు.