telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆత్మవిశ్వాసంతో ధోనీ చెప్పిన ఆ మాట వింటే నవ్వొచ్చింది..

Ms dhoni cricketer

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టు పగ్గాలను తొలిసారిగా 2007 టీ20 ప్రపంచకప్ ముందే అందుకున్న విషయం తెలిసిందే. ఆరంభంలో టీ20 క్రికెట్‌ను వ్యతిరేకించిన బీసీసీఐ ఈ ఫార్మాట్ అరంగేట్ర ప్రపంచకప్‌ను పెద్దగా పట్టించుకోలేదు. సీనియర్ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లు కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకొని యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌కు సూచించారు. దాంతో యువ జట్టు సారథిగా ధోనీ టీమ్‌ను నడిపించాడు. అయితే ఈ టోర్నీ ముందు టీ20 ప్రపంచకప్‌తోనే భారత్‌కు తిరిగొస్తామని ధోనీ చెప్పడం తనను షాక్‌కు గురిచేసిందని నాటి సెలెక్టర్ సంజయ్ జగ్దాలే గుర్తు చేసుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ధోనీ చెప్పిన ఆ ఒక్క మాటతో తాను లేచి రెండు చేతులు జేబులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్లిపోయానని, ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియనంత అవాక్కయ్యానని, నవ్వుకున్నానని ఈ మాజీ సెలెక్టర్ గుర్తు చేసుకున్నాడు. ‘2007లో నేను టీమిండియా సెలెక్టర్‌గా ఉన్నా. ఇంగ్లండ్‌ పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టుతోనే ఉన్నా. దిలీప్ వెంగ్‌సర్కార్ సెలెక్షన్ ఛైర్మన్. అక్కడే 2007 టీ20 వరల్డ్ కప్ టీమ్ ఎంపిక కోసం సమావేశమయ్యాం. సచిన్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ జట్టు ఎంపికలో తమను పరిగణలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. యువ ఆటగాళ్లను తీసుకోవాలని సూచించారు. దాంతో మేం యువకులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేశాం. జట్టు సారథిగా ధోనీ ఉండాలని నా అభిప్రాయాన్ని చెప్పా. అన్నట్లుగా ధోనీ తొలిసారి సారథిగా ఎంపికయ్యాడు. ధోనీ నాతో అన్న మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి. నేను అతనితో ఇది మంచి టీమ్ అని చెప్పా. దానికి అతను ‘సర్ మేం వరల్డ్‌కప్‌తోనే తిరిగొస్తాం’అని చెప్పాడు. ఆ మాటలు, అతని ఆత్మవిశ్వాసానికి నేను షాక్ అయ్యా’అని జగ్దేల్ గుర్తు చేసుకున్నాడు. ఆటోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ధోనీసేన.. ఫైనల్లో దాయాదీ పాకిస్థాన్‌ను చిత్తుచేసి ప్రపంచకప్‌ను ముద్దాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ధోనీ సారథ్యంలోనే భారత్ 2011 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. దాంతో మూడు ఐసీసీ టైటిళ్లు నెగ్గిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా మహీ సారథ్యంలోని భారత్ అన్ని ఫార్మాట్లలో ఫస్ట్ ర్యాంక్‌ను కూడా అందుకుంది.

Related posts