telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్-ఇంగ్లాండ్ సిరీస్ కు భువి దూరం…

గత రెండేళ్లుగా టీమిండియాను గాయాల బెడద వీడడం లేదు. గాయాల కారణంగా స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా కొంతకాలం జట్టుకు దూరమవుతున్నారు.యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సమయంలో గాయపడిన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఏకంగా ఆరు నెలలు ఆటకి దూరంగా ఉండబోతున్నాడు. ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభంలోనే భువీ తొడ కండరాలకి గాయమవగా.. ఇప్పటికీ అతడు ఫిట్‌నెస్ సాధించలేదు. వచ్చే జనవరి 10 నుంచి ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం ఉత్తర్‌ప్రదేశ్ జట్టు సెలెక్షన్ కమిటీ.. భువీ ఫిట్‌నెస్‌ను తాజాగా పరిశీలించింది. అతను కనీసం ఆరు నెలలు ఆటకి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారట. దీంతో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా భారత్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న సుదీర్ఘ సిరీస్‌కి కూడా భువనేశ్వర్ కుమార్ దూరంగా ఉండబోతున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో గాయపడిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఇప్పటికే ఆరు వారాలు క్రికెట్‌కి దూరమయ్యాడు. షమీ కూడా ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. ఇప్పుడు భువీ కూడా దూరమవడం కోహ్లీసేనను కలవరపెడుతోంది. ఇంగ్లాండ్‌ సిరీస్ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ జరిగే సూచనలు ఉన్నాయి. అప్పటికి కూడా భువనేశ్వర్ ఫిట్‌నెస్ సాధించడం సందేహంగానే కనిపిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లో భువీ ఆడుతున్న విషయం తెలిసిందే.

Related posts