telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు జవాబుదారీతనంతో పారదర్శకంగా పనిచేస్తున్నాం – మంత్రి కేటీఆర్

రూ. 8 54 కోట్ల వ్యయంతో బేగంపేట లో  నిర్మించిన స్మశాన వాటిక ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

 క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు జవాబుదారీతనంతో పారదర్శకంగా పనిచేస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సికింద్రాబాద్ జోన్ బేగంపేట్ డివిజన్ ధనియాల గుట్టలో రూ. 8.54 కోట్ల వ్యయంతో నిర్మించిన శ్మశానవాటిక మంగళవారం మంత్రి కే టి ఆర్  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య, సినిమాటోగ్రఫీ  శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్  శంభీపూర్ రాజు  ఎమ్మెల్సీ లు నవీన్ కుమార్, ఎమ్మెల్యే లు మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చడంలో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, త్రాగునీరు, విద్యుత్, చెరువులు, నాలాలు, దోమల నియంత్రణ, వీధి కుక్కల ప్రమాదాల నుండి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానం కంటే బేగంపేట్ ధనియాల గుట్ట  వైకుంఠ దామం అధునాతన సదుపాయాలతో నిర్మించబడిందని తెలిపారు. కూకట్ పల్లి, సనత్ నగర్ – బల్కంపేట, లలో  వైకుంఠ  నిర్మించిన విషయం తెలిసిందేనని అదే విధంగా ఎల్బీనగర్ లలో 9 ఎకరాల లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మహాప్రస్థానం (వైకుంఠదామం) లను చేపట్టినట్లు   తెలిపారు. తొమ్మిదేళ్లలో విశ్వనగరంగా హైదరాబాద్ ను  అభివృద్ధి ని చూసి  దేశ విదేశాల ఉండి సందర్శన కోసం వచ్చిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నారు.

ప్రతి సంవత్సరం నూతనంగా రోడ్లు, ఫ్లైఓవర్లు, పార్కులు బ్రిడ్జిలను ఏర్పాటు చేసి ప్రజలకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రూ. 45 లక్షల విలువ గల రెండు అంతిమయాత్ర వాహనాలను విరాళం గా అందజేసిన దాత  నర్సింహా రెడ్డి ని  అభినందించారు అంతేకాకుండా ఆయనను సన్మానించారు  ఈ స్మశానవాటికలో వైకుంఠదామం, స్వర్గధామం, ముక్తిధామం వంటి గదులతో పాటు పూజ గది, లాకర్లు, స్నానాల గదులు ఉన్నాయని తెలిపారు. అంతిమ యాత్రలో పాల్గొన్న వారు సేదతీరేందుకు కెఫిటేరియా ను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటితో పాటు హైదరాబాద్ నగరంలో రూ. 3,866 కోట్ల  వ్యయం తో చేపట్టిన  నగరం లో  100 శాతం మురుకు నీరు లేకుండా31  పనులుసివరేజ్  ట్రీట్ మెంట్ ప్లాంట్ లను ఆగస్టు 31 వరకు పూర్తి అవుతాయని అన్నారు.
నగరంలో , లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరలో పంపిణీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్ బే, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో, సర్వ మతాలకు వైకుంఠధామాలు అభివృద్ధి ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి కే సీ అర్  ఆదేశించిన విధంగా ప్రజల అవసరాలను తీర్చే విధంగా పనులు ఉండాలని  అందుకు ముందుకు వెళుతున్నట్లు  మంత్రి అన్నారు  నలాల అభివృద్ధికి 985 కోట్లతో పనులను చేపట్టాం. అంతేకాకుండా గతం లో నీట మునిగిన  ప్రాంత ప్రజలకు రూ. 560 కోట్ల సహాయం అందించగా  కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వ లేదని అన్నారు. మమ్మలిని గెలిపించిన ప్రజల కోసం చిత్తశుద్ది, నిబద్దతతో పని చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పనలో వేగవంతంగా  పూర్తి చేస్తున్నట్లు  జిహెచ్ఎంసి కమిషనర్ ను, ఇంజనీర్లను మంత్రి అభినందించారు. ఎస్.ఎన్.డి.పి ద్వారా రూ. 985 కోట్ల వ్యయంతో నాలాల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
నాలాలు, డ్రైనేజీ వ్యవస్థను ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని తెలిపారు.  తెలంగాణ రాష్ట్రంలో సమర్ధవంతమైన నాయకుడు కేసీఆర్ ఉండటం వల్ల రాజకీయ స్థిరత్వం ఏర్పడి పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. హరితహారం, పల్లె, పట్టణ ప్రగతిలో చాలా పనులు చేయడం మూలంగా దేశ స్థాయిలో చాలా అవార్డులు వచ్చాయి. ఐటీ రంగంలో, ఇండస్ట్రీ రంగంలో పెట్టుబడులు భారీగా రావడానికి రాజకీయంగా తెలంగాణ స్థిరత్వం ఉండడమే కారణమని అన్నారు. మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతరులు కొట్టే డైలాగులు విని మోసపోవద్దు అని ప్రజలను కోరారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టే విధంగా పని చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…. ధనియాల గుట్ట  వైకుంఠంధామం ఏర్పాటు ద్వారా చుట్టూ ఉన్న 20 బస్తీలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇందులో శ్యామ్ లాల్ పేట్, వడ్డెర బస్తీ, ప్రకాష్ నగర్ ప్రజల సమస్యలు తీరాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 32 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మౌలిక సదుపాయాల కల్పనలో వేగవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ఒకప్పుడు కూకట్ పల్లి, బాలానగర్, బోయిన్ పల్లి, ఫతేనగర్, బల్కంపేట, చింతల్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, స్టీల్ బ్రిడ్జి లు అభివృద్ధి చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్య తీరిందని తెలిపారు. వీటితో పాటు గార్డెన్, బస్ బే, నాలాల అభివృద్ధి చేశారని తెలిపారు. వరదలు వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిందన్నారు. వీటికి శాశ్వత పరిష్కారంగా వెయ్యి కోట్లతో నాలాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. అంతే కాకుండా అతితక్కువ కాలంలో నూతన సచివాలయం నిర్మించి రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ గా నామకరణం చేసి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ…  కూకట్ పల్లిలో రానున్న కాలంలో 54 గ్రేవ్ యార్డ్ లను అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యు.బి.డి అడిషనల్ కమిషనర్ వి కృష్ణ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ సి రత్నాకర్, కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి  తదితరులు పాల్గొన్నారు.

Related posts