telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేంద్రం .. రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహార చెల్లింపులు .. ఆలస్యం చేస్తుంది..

non bjp states fire on gst grant

బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు జీఎస్‌టీ పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించాల్సిన నిధుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. తమకు బకాయిలు త్వరగా చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. ప్రతిసారీ అడుక్కునేట్టు చేయడం తమకు ఇబ్బందిగా ఉందని ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. దిల్లీ, పంజాబ్‌, పుదుచ్ఛేరి, మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్థిక మంత్రులు, కేరళ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. పరిహారం విషయమై చర్చించారు.

ఈ సందర్భంగా పంజాబ్‌ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌సింగ్‌ బాదల్‌ మాట్లాడుతూ..పరిహారం చెల్లింపుపై ఆర్థిక మంత్రితో మాట్లాడాం. అక్టోబర్‌- నవంబర్‌ నెలలకు సంబంధించి పరిహారం గడువు కూడా అప్పుడే వచ్చేసింది. డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. మేం చాలా ఇబ్బంది పడుతున్నాం. జైళ్లు, పాఠశాలలు మూసివేయలేం. పెన్షన్లు చెల్లించాలి. ప్రతిరోజూ దిల్లీ రాలేం. మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. డబ్బులు గురించి అడిగే వాళ్లు దీని గురించి పట్టించుకోవడం లేదు. పరిహారం చెల్లిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. కానీ ఎప్పుడిస్తారనేది చెప్పలేదని బాదల్‌ పేర్కొన్నారు. సుమారు రూ.50వేల కోట్లు రాష్ట్రాలకు ప్రభుత్వం చెల్లించాలని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అన్నారు. ఈ విషయంలో వ్యక్తిగత చొరవ తీసుకోవాలని తాము నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం ఇంత వరకు కేంద్రం చెల్లించలేదు. అలాగే అక్టోబర్‌, నవంబర్‌ నెలలకు సంబంధించిన పరిహారం కూడా డిసెంబర్‌ 10 తర్వాత చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పరిహారం చెల్లింపులో జాప్యంపై రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Related posts